త్వరగా పరిహారం పంపిణీ చేయకపోతే... ఇన్‌‘ఫట్టే’..! | Input subsidy | Sakshi
Sakshi News home page

త్వరగా పరిహారం పంపిణీ చేయకపోతే... ఇన్‌‘ఫట్టే’..!

Published Sun, Dec 21 2014 2:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Input subsidy

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వశాఖల నిర్లక్ష్యం..బ్యాంకర్ల కొర్రీలు...నిధుల విడుదలలో జాప్యం వెరసి అన్నదాత అరిగోస పడుతున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా...దిగుబడి తగ్గి కరువు కోరల్లో చిక్కుకున్నారు. ఇటువంటి తరుణంలో రైతాంగానికి వచ్చిన సాయాన్ని కూడా అందించలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో ఎప్పుడో మూడున్నరే ళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతుల్లో దాదాపు 53 వేలమందికి  ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ (పరిహారం) అందలేదంటే ప్రభుత్వవ్యవస్థల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో 2011 ఏప్రిల్‌లో వచ్చిన వడగండ్ల వాన కారణంగా జరిగిన నష్టం వివరాలను ఇప్పటికీ ఇవ్వకపోవడం గమనార్హం. మొత్తంమీద   మూడున్నరేళ్ల నష్టాలలో 1.80 లక్షల మంది రైతులు పంటలను కోల్పోగా, వారిలో కేవలం 1.22 లక్షల మందికి మాత్రమే ఇన్‌పుట్‌సబ్సిడీ అందజేశారు. గత ఆగస్టులో ఇన్‌పుట్‌సబ్సిడీ కింద మంజూరైన  రూ.75.85కోట్ల నిధులకు గాను 22 కోట్ల రూపాయలు పంపిణీ కాకుండా బ్యాంకుల్లో మూలుగుతుండడం గమనార్హం.
 
 ఖాతా కొర్రీ... రైతుకు వర్రీ
 వాస్తవానికి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసే విషయంలో బ్యాంకు ఖాతాల అంశమే ప్రధాన సమస్యగా మారుతోంది. జిల్లాలో చాలామంది రైతులకు బ్యాంకుఅకౌంట్లు లేని కారణంగా ఇన్‌పుట్ సబ్సిడీ కింద వచ్చిన మొత్తం నగదును కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... జిల్లాలో 2009-10 నుంచి 2014-15 సంవత్సరం వరకు వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 50శాతం కంటే ఎక్కువ పంటనష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్‌సబ్సిడీ కింద రూ.75.85 కోట్లను ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. అయితే బ్యాంకు అకౌంట్ల వివరాలు లేని కారణంగా కేవలం 1,52,953 మంది రైతులకు వారి వ్యక్తిగత ఖాతాలలో రూ.64.89 కోట్లను మాత్రమే జమ చేశారు. మిగిలిన రూ.10.94 కోట్లను డ్రా కూడా చేయలేదు. అయితే, బ్యాంకుల్లో జమ చేసిన దాంట్లో మొత్తం కూడా రైతులకు చేరలేదు.
 
 అందులో బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేవని, తప్పులున్నాయనే సాకుతో కేవలం 1,22,156 మంది రైతులకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ రూ.53.77 కోట్లు జమ అయింది. మిగిలిన రూ.11.12 కోట్లు రైతుల ఖాతాలో జమ కాకుండా బ్యాంకర్ల వద్దే నిలిచిపోయింది. అయితే, ఈ తప్పులున్న ఖాతాల వివరాలను సరిచేసి పంపాలని 45 రోజుల క్రితమే మండల వ్యవసాయ అధికారులకు వివరాలు పంపగా,  ఆ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తి కాలేదు. మరోవైపు అసలు బ్యాంకు అకౌంట్ల వివరాలే లేని కారణంగా పంపిణీ చేయకుండా నిలిచిపోయిన రూ.10.94 కోట్లు కూడా అంతే ఆగిపోయాయి. వీటన్నింటినీ ఈనెల 15వతేదీకల్లా పూర్తి చేస్తామని చెప్పిన వ్యవసాయశాఖ అధికారులు.. ఇప్పుడు మాత్రం వివరాలను బ్యాంకర్లకు పంపామని, మరో 15 రోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాకు వెళుతుందని చెబుతుండడం గమనార్హం.
 
 సున్నా పెట్టకపోయినా....
 ఇక, బ్యాంకు ఖాతాల విషయంలో బ్యాంకర్లు విధిస్తున్న కొర్రీలు కూడా రైతన్నలకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. నిరక్షరాస్యులైన రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాల్లో మొదట్లో పెట్టాల్సిన సున్నా పెట్టకపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ జమచేయకుండా తిరస్కరిస్తున్నారు. కొందరు రైతులు బ్యాంకు ఖాతాలు సరిగా నిర్వహించకపోయినా, 12లేదా 14 అంకెల ఖాతానంబరు రాయకపోయినా,  వెనక్కి పంపుతున్నారే తప్ప పాత వివరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కొన్ని చోట్ల ఒకే బ్యాంకుకు చెందిన రెండు శాఖలు ఒకే ఊర్లో ఉంటే ఆ ఊరు పేరు రాసి, శాఖ పేరు రాయకపోయినా జమ చేయడం లేదంటే బ్యాంకర్ల కొర్రీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో రైతులు కూడా కొంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉన్నా... స్థానిక అధికారులు రైతులకు ఇబ్బందులకు కలగకుండా వ్యక్తిగతంగా విచారణ జరిపి వారి బ్యాంకు ఖాతాల వివరాలను పంపడంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
 
 కరువుతో అల్లాడుతున్న తమకు ఇన్‌పుట్‌సబ్సిడీ కింద ఎకరానికి రూ.2400 కానీ, రూ.4000 కానీ వస్తే రబీ పెట్టుబడులకో, కుటుంబ ఖర్చులకో ఉపయోగపడుతుందని, వెంటనే తమకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఆ 53వేల మంది రైతులు కోరుతున్నారు. మరోవైపు ఆగస్టులో వచ్చిన ఈ నిధులను 90 రోజుల్లో వినియోగించుకోకుంటే అవి మళ్లీ ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. అధికారులు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయనిపక్షంలో ఆ నిధులు ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోతే మళ్లీ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేందుకు మరో పుష్కరకాలం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రైతుసంఘాల నేతలంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement