వారం రోజులే... | Each family bank accounts last one week | Sakshi
Sakshi News home page

వారం రోజులే...

Published Wed, Jan 7 2015 3:39 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

Each family bank accounts last one week

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ప్రతి కుటుంబానికి నెలరోజుల్లో బ్యాంకు అకౌంట్లు ఇప్పిస్తామని చెప్పిన  కలెక్టర్ టి. చిరంజీవులు ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కుటుంబాలన్నింటికీ కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన  కింద ఈ ప్రకియ్రను వారం రోజుల్లో పూర్తిచేసి, తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లున్నాయని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆయన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీ ఓ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో ఇప్పటికే 95శాతం కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లున్న నేపథ్యంలో మిగిలిన 5 శాతం మందికి వారంరోజుల్లో సమీప బ్యాంకుల్లో అకౌంట్లు ఇప్పించేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించనున్నారు.
 
 రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నివారించే విషయంపై కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సిద్ధమైన తుదిజాబితాల్లో నుంచి అనర్హులను వెంటనే తీసివేయాలని, ఎవరైనా అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు రాకపోతే వారి పేర్లను చేర్చాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇటీవలే కబ్జా స్థలాల క్రమబద్ధీకరణపై రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గురించి కూడా స్థానిక యంత్రాంగానికి అవగాహన కల్పించనున్నారు. ఈ అంశాలపై మునిసిపాలిటీల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ యోచిస్తున్నారు. ఇందుకోసం మునిసిపాలిటీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కౌన్సిలర్లను ఇందులో భాగస్వాములను చేయనున్నారు. అందులో భాగంగా బుధవారం నల్లగొండ మునిసిపల్ కౌన్సిలర్లతో ఆయన సమావేశం కానున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement