అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన ఎగిసిపడుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ, ఏపీ ఎన్జీవోల బంద్ పిలుపుతో రెండో రోజైన శనివారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులతో పాటు అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు, జాక్టో, విద్యుత్, ఆర్టీసీ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్, విద్యార్థి జేఏసీలతో పాటు సామాన్యులు సైతం బంద్‌లో పాలుపంచుకోవడంతో సమైక్య ‘జ్వాలలు’ ఎగిసిపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు బంకులు... సర్వం మూతబడ్డాయి.
పైవేట్ వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. జిల్లా గుండా వెళ్లే రాష్ట్ర, జాతీయ రహదారులన్నీ దిగ్బంధించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల పాతటైర్లు, దుంగలు, చెట్ల కొమ్మలు వేసి నిప్పు పెట్టారు. దీంతో రోడ్లన్నీ అగ్నిగుండల్లా మారాయి. అనంతపురం నగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, సమైక్యవాదులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు.
నగరంలోని అన్ని రోడ్లలో పాతటైర్లకు నిప్పు పెట్టి దిగ్బంధం చేశారు. రాంనగర్ రైల్వే గేటు, రహమత్‌నగర్ రైల్వే బ్రిడ్జి, ఓవర్‌బ్రిడ్జి, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో రైలు పట్టాలపై సమైక్యవాదులు అడ్డురావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వేస్టేషన్‌పై కొందరు రాళ్లు రువ్వారు. రహమత్‌నగర్ రైల్వేబ్రిడ్జిపై గూడ్సురైలును ఆపి రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. జెడ్పీ సమీపంలోని పోస్టుబాక్సుకు నిప్పంటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవో నేతలు బంద్ చేయించారు. తపోవనం సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఎన్‌జీఓలపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనయులు దాడి చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమన్నారు. దాడికి నిరసనగా ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ నేతలు నిరసన కార్యక్రమం చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంతకల్లు పట్టణంలో రోడ్లపై పాతటైర్లకు నిప్పు పెట్టారు. ఇంధన ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్లు దీక్ష చేశారు. గుత్తిలో జాక్టో, జేఏసీ ఆధ్వర్యంలో గౌతమపురి వికలాంగులు రిలే దీక్షలకు దిగారు. హిందూపురం రైల్వేస్టేషన్‌లో సమైక్యవాదులు గుంటూరు, కేకే ఎక్స్‌ప్రెస్ రైళ్లను అడ్డుకున్నారు. సమైక్యవాదులకు వైఎస్సాఆర్‌సీపీ నాయకుడు నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో విద్యుత్ ఉద్యోగులు రిలే దీక్ష చేశారు.
బైక్ ర్యాలీ చేపట్టి... బంద్ విజయవంతం చేశారు. తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట, తనకల్లులో బంద్ సంపూర్ణంగా జరిగింది. కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తపాలా కార్యాలయాన్ని బంద్ చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని జేఏసీ రిలేదీక్షల్లో నేతలు తప్పుబట్టడంతో జీర్ణించుకోలేని ‘తమ్ముళ్లు’ దౌర్జన్యానికి దిగారు.
దీంతో జేఏసీ నాయకులు ఆగ్రహించి టీడీపీ శిబిరంలోని పార్టీ జెండాలు తొలగించారు. వేదికను పెకలించివేశారు. అమరాపురంలో ఎంపీ హర్షకుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మడకశిర, రొళ్ల, గుడిబండలో బంద్ విజయవంతమైంది. పుట్టపర్తి, నల్లమాడ బుక్కపట్నం, కొత్తచెరువులో బంద్ విజయవంతమైంది. ఓడి చెరువులో వినూత్న రీతిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పెనుకొండ, రాయదుర్గంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు మానవహారం నిర్మించారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు లారీల రాకపోకలను అడ్డుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రిలేదీక్షలు చేశారు. రాయలచెరువులో రైల్‌రోకో చేశారు. ఉరవకొండ పట్టణంలోని బళ్లారి-అనంతపురం రహదారిని విద్యార్థులు దిగ్బంధించారు. గతంలో కేసీఆర్ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని జేఏసీ నేతలు, సమైక్యవాదులు ధ్వంసం చేశారు. బెళుగుప్ప మండల కాంగ్రెస్ కన్వీనర్, మాజీ జెడ్పీటీసీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిపి దాదాపు 180 మంది అధికార పార్టీకి రాజీనామా చేశారు. కూడేరులో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ, బంద్ చేపట్టారు.
మండుతున్న ‘అనంత’
Published Sun, Oct 6 2013 3:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement