అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ చెంతనే అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు.
దుర్గగుడిలో సిబ్బంది హస్తలాఘవం
అమ్మవారి సొమ్మునే దోచేస్తున్న వైనం
అయినా చర్యలు నామమాత్రం
తెరవెనుక కథలెన్నో..
విజయవాడ : అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ చెంతనే అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన సొమ్మును నిస్సిగ్గుగా కాజేయడానికి చూస్తున్నారు. దొరికిన వారు దొంగలు కాగా.. దొరకని వారు దొరల్లా చెలామణి అవుతున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన సుమారు రూ.లక్ష విలువచేసే మంగళ సూత్రాలు, నానుతాడును దేవస్థాన కేశఖండనశాలలో తాత్కాలిక క్షురకుడిగా పనిచేసే రామసుబ్బారావు దొంగిలిస్తూ గురువారం పట్టుబడ్డాడు. అయితే, అమ్మవారి సొత్తు చోరీకి గురవడం ఇదే తొలిసారేం కాదు. గత జూలైలో పైడిరాజు అనే క్షురకుడు హుండీల లెక్కింపు సమయంలో సుమారు రూ.5వేలు చోరీచేస్తూ కెమెరాకు చిక్కాడు. సదరు పైడిరాజు అమ్మవారి సొమ్ము కాజేతకు అసిస్టెంట్లను కూడా పెట్టుకున్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు.. అమ్మవారి సొమ్మును కాజేస్తూ దొరికిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తే.. వారు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి విధులకు హాజరయ్యారు. హుండీల లెక్కింపు సమయంలో చోరీకి పాల్పడినా కఠిన శిక్షలేమీ ఉండవని పలువురు సిబ్బందే చెబుతుండటంతో ఈ తరహా ఘటనలు ఇంద్రకీలాద్రిపై నిత్యకృత్యమైపోయాయి. అక్రమాల పుట్ట తవ్వితే లెక్కలేనన్ని అవినీతి పాములు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే..
కొండపై ఉన్న సుమారు 13 దుకాణాలకు గడువు ముగిసినా అధికారులు ఆక్షన్ నిర్వహించలేదు. దుకాణదారులు రూ.58వేలకు దేవస్థానం వద్ద అద్దెకు తీసుకుని రూ.2లక్షలకు సబ్‌లీజుకు ఇస్తున్నారు. షాపులు వేలం వేయమని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా అధికారులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండి కమిషనర్‌కు లేఖలు రాస్తామంటూ తాత్సారం చేస్తూ అమ్మవారికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు.
కొండపైకి ప్రవేశించే ప్రయివేటు వాహనాలకు గతంలో ట్రిప్పుకు రూ.25 వసూలు చేసేవారు. అయితే, కొంతమంది ఆలయ ఉద్యోగులు, టీడీపీ నేతల రంగప్రవేశంతో ఆటోలకు అనుమతులు ఇప్పించారు. ఇం దుకు రోజుకు రూ.175 టోల్‌ఫీజు నిర్ణయించారు. దీనివల్ల దేవస్థాన బస్సులకు ఆదాయం రావట్లేదు.
ఆలయలో సుమారు 55 మంది అనధికార అర్చకులు పనిచేస్తున్నారని ఈవో గుర్తించారు. వీరిని తొలగించేందుకు ప్రయత్నించగా దేవస్థానంలో కొంతమంది ఉద్యోగస్తులు, అర్చకులు.. అనధికార అర్చకులతో బేరం పెట్టారు. ఒక్కో అర్చకుడు రూ.50 వేలు చెల్లిస్తే తొలగింపు అడ్డుకుంటామని తెలిపారు. ఫలితంగా హుండీల ద్వారా రావాల్సిన సొమ్ము దక్షిణ రూపంలో అర్చకులకు చేరుతోంది.
అమ్మవారి ప్రసాదాల తయారీలోని నెయ్యి, జీడిపప్పు, ఇతర పదార్థాలు పక్కదారి పడుతున్నాయి. ఈ విషయం ఈవో దృష్టికి రాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక దర్శనానికి రూ.100, రూ.50 టికెట్లు కొనాల్సి ఉంటుంది. ఆలయ సిబ్బంది కొంతమంది వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకుని వారి కటుంబసభ్యులకు ఉచితంగా దర్శనాలు, తీర్థప్రసాదాలు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటూ తమ జేబులు నింపుకొంటున్నారు.