
వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చట్టం ప్రకారం ఎంసెట్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావుతో వేణుగోపాల రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై చర్చించినట్లు తెలిపారు. యథావిధిగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని సుప్రీంకోర్టు చెప్పలేదని తెలిపారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. నిన్న అడ్మిషన్ల కమిటీలో తీసుకున్న నిర్ణయాలనే కొనసాగిస్తామని చెప్పారు. ఈ నెల 30న ఎంసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వచ్చే నెల 7న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. కౌన్సెలింగ్ ఆలస్యానికి దారితీసిన పరిస్థితులను సుప్రీంకోర్టులో వివరిస్తామని వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.