హమ్మయ్య ముగిసిన ఎంసెట్ | Eamcet exam finished | Sakshi
Sakshi News home page

హమ్మయ్య ముగిసిన ఎంసెట్

Published Sat, May 9 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

హమ్మయ్య ముగిసిన ఎంసెట్

హమ్మయ్య ముగిసిన ఎంసెట్

ఆర్టీసీ సమ్మె కారణంగా సర్వత్రా ఉత్కంఠ రేపిన ఎంసెట్-15 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.

నిమిషం ఆలస్యం నిబంధన సడలింపుతో  ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు
ఇంజనీరింగ్‌కు 10,312 మంది..
మెడిసిన్‌కు 3,601 మంది హాజరు

 
నెల్లూరు (అర్బన్) : ఆర్టీసీ సమ్మె కారణంగా సర్వత్రా ఉత్కంఠ రేపిన ఎంసెట్-15 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. సమ్మె నేపథ్యంలో పరీక్ష ఎలా జరుగుతుంది? విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోగలరా? లాంటి అనుమానాలతో అందరి చూపు ఎంసెట్ పైనే నిలిచింది. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధనను సడలించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల హడావుడి కనిపించింది. ఆర్టీసీ సమ్మె కారణంగా ముందురోజే విద్యార్థులు పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. అధికారులు 172 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో మొత్తంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష సజావుగా జరిగేందుకు కలెక్టర్ జానకి ప్రత్యేక చొరవ చూపారు. అధికారులను భాగస్వాములను చేశారు. ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష 20 కేంద్రాల్లో, మధ్యాహ్నం మెడిసెన్, అగ్రికల్చర్ పరీక్ష 8 కేంద్రాల్లో జరిగింది. ఇంజనీరింగ్ పరీక్షకు 10,840 మంది విద్యార్థులకు గాను 10,312 మంది హాజరయ్యారు. 528 మంది గైర్హాజరయ్యారు.

మెడిసెన్, అగ్రికల్చర్ పరీక్షకు 3,736 మంది విద్యార్థులకు గాను 3,601 మంది హాజరయ్యారు. 135 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు విద్యార్థులను అనుమతించడంతో ఆఖరి నిమిషాల్లోనూ విద్యార్థులు హడావుడి  కేంద్రాలకు రావడం కనిపించింది. కాగా పలు కేంద్రాల్లో తల్లిదండ్రులను హాలులోకి అనుమతించకపోవడంతో వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పరీక్ష ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి బయటకు పంపేయడంతో తల్లిదండ్రులు ఎండలో, చెట్ల కింద నిరీక్షిస్తూ గడిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పరీక్ష కేంద్రాల బయట స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశాయి.

 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు
 పరీక్ష కేంద్రాలను కలెక్టర్, ఐజీ, ఎస్పీలు పరిశీలించారు. కలెక్టర్ జానకి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ, కృష్ణచైతన్య కాలేజీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై ఆరాతీశారు. హాల్‌టికెట్ నంబర్లు సరిగ్గా వేశారా? లేదా? చూశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, ఎస్పీ డాక్టర్ గజారావు భూపాల్‌లు డీకేడబ్ల్యు కాలేజీలో పరీక్ష తీరును పరిశీలించారు. అలాగే ఎస్పీ వీఆర్ కాలేజీలో పరీక్ష తీరును తనిఖీ చేశారు. ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ వై.రామ్మోహన్‌రావు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

 పరీక్ష రాసిన హత్యకేసు నిందితుడు
 ఓ హత్యకేసు నిందితుడు డీకేడబ్ల్యూ కళాశాలలో ఎంసెట్ పరీక్షను రాశాడు. మార్చి 27వ తేదీన నర్సింహకొండలో బత్తిబాబు హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విద్యార్థి పరీక్ష రాశాడు. ప్రస్తుతం జ్యువైనల్ హోం ఉన్న ఇతను ఉన్నతాధికారుల అనుమతితో పరీక్ష రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement