
ఎంసెట్ ప్రశాంతం
ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం కర్నూలు, నంద్యాల పట్టణాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
కర్నూలు(జిల్లా పరిషత్) : ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం కర్నూలు, నంద్యాల పట్టణాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు కాస్త ఆందోళన చెందినా ప్రతి ఒక్కరూ పరీక్ష సమయానికి చేరుకున్నారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో పలు కేంద్రాల వద్ద నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చిన వారిని కూడా అనుమతించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోని వరండాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
జిల్లా మొత్తంగా 905 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. కర్నూలు, నంద్యాలలో రెండు పరీక్షలకు కలిపి మొత్తం 16,301 మంది దరఖాస్తు చేసుకోగా 15,396 మంది హాజరయ్యారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ రఘుబాబు, నంద్యాలలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, యోగివేమన యూనివర్సిటీ నుంచి రామశివారెడ్డి, కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి 500 మందికి ఒక అబ్జర్వర్‌ను, ప్రతి మెడికల్ సెంటర్‌కు ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌ను, ఆరుగురు రెవెన్యూ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను, ప్రతి నాలుగు సెంటర్లకు ఒక స్పెషల్ అబ్జర్వర్‌లను నియమించారు.
నంద్యాల డివిజన్‌లోని కొన్ని కళాశాలల విద్యార్థులకు సైతం కర్నూలులో పరీక్ష కేంద్రాలను వేయడం వల్ల వారు ఇబ్బందికి లోనయ్యారు. ఆళ్లగడ్డ మండలం చిన్నకుంట గ్రామానికి చెందిన పి.కుమారి కోవెలకుంట్ల ఏపీఆర్‌జేసీ కళాశాలలో చదువుతోంది. ఆమెకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వేశారు. వారు స్వగ్రామం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరినా సరిగ్గా పది గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో ఆందోళనకు చెందారు.
ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, ఆస్పరి నుంచి కొందరు విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో ప్రత్యేక వాహనాల్లో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద కొందరు విద్యార్థులు రెండు గంటల ముందు నుంచే పడిగాపులు కాశారు. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు కూడా రావడంతో పరీక్ష కేంద్రాలు కిక్కిరిశాయి. పిల్లలు పరీక్ష ఎలా రాస్తారోనన్న ఆతృత తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనిపించింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌తో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బస్సుల్లేక ఆందోళన
మా ఊరు చిన్నకుంట. కోవెలకుంట్లలోని ఏపీఆర్‌జేసీలో ఇంటర్ పూర్తయింది. ఎంసెట్ పరీక్షకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను కేంద్రంగా వేశారు. నాన్న బాలనర్సయ్యతో కలిసి ఉదయం 6 గంటలకు ఊరి నుంచి బయలుదేరాం. ఆళ్లగడ్డకు వచ్చినా సమయానికి బస్సు రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత వచ్చినా ప్రతి స్టేజ్ వద్ద ఆపుతూ రావడంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైంది. అటుఇటుగా అయ్యుంటే నా భవిష్యత్ ఏమయ్యేది.
- పి.కుమారి, ఆళ్లగడ్డ