తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతుండటంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు.
హైదరాబాద్లో ఇంజనీరింగ్ విభాగానికి 17, మెడికల్, అగ్రికల్చర్ పరీక్షకు 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ ఒక్కటే సెంటర్ కేటాయించడంతో జిల్లాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్ శివారు ప్రాంతంలో పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణగూడ, బర్కత్పుర తదితర సెంటర్లకు ఉదయం 7 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు.