భూ కబ్జాను అడ్డుకోండి
జిల్లా కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
గుంటూరు ఈస్ట్: 530 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి చదును చేస్తుంటే అధికారుల చర్యలు తీసుకోకపోవడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణపై ఫిర్యాదులు అందినా స్థానిక తహశీల్దార్, ఆర్డీవో వచ్చామా వెళ్లామా అన్నట్టుగా స్థలాన్ని చూసి మిన్నకుండిపోయారని ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలసి తమ తమ నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తొలుత ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు వివరించారు. మాచర్ల మండలం కొత్తపల్లి-ద్వారకాపురి సరిహద్దుల్లో ఎద్దులబోడుగా పిలుచుకునే 530 ఎకరాల బీడు భూమిని 60 ఏళ్లుగా పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కరువు వచ్చినప్పుడు కూడా పశువులను ఈ ఎద్దులబోడే ఆదుకుంటోంది.
మూగజీవాల పొట్టకొడుతూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎద్దులబోడును ఆక్రమించి పట్టపగలే పొక్లయిన్ల సాయంతో చదును చేస్తున్నారు. ఈ పరిణామాలకు ఆందోళనకు గురైన రైతులు స్థానిక తహశీల్దారు, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఆక్రమణకు గురవుతున్న ఎద్దులబోడును పరిశీలించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు.
తక్షణం స్పందించి ఎద్దులబోడుని రక్షించి ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పిన్నెల్లి జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
మాచర్ల మున్సిపాలిటిలోని కాం ట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు.
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో మరుగు దొడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాకుండా టీడీపీ నేతలు ఎంపీడీవో పై ఒత్తిడి తెస్తున్నా రని ఆరోపించారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులకు నిధులు మంజూరయ్యేలా చూడా లన్నారు.
ఇరువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తులకు స్పందించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల వెంట వైఎస్సార్ సీపీ కారంపూడి కన్వీనర్ మేకల శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు దర్శనపు శ్రీనివాస్ ఉన్నారు.