గందరగోళం మధ్య ...
Published Fri, Dec 13 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: ఇటీవల వాయిదా పడిన ఎచ్చెర్ల మండల మహిళా సమాఖ్యకు తీవ్ర గందరగోళం మధ్య పాతకార్యవర్గాన్నే మార్చి వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలిగా పైడి రాజులమ్మ ఎన్నికయ్యారు. ఎచ్చెర్ల టీటీడీసీ కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ఎన్నికకు 25 వీవోల నుంచి అధ్యక్షులు హాజరయ్యారు. ఐబీ మాస్టర్ ట్రైనర్ మరయమ్మ, జిల్లా సమాఖ్య ఐబీ కమిటీ సభ్యులు ముగ్గురితో కలిసి ఎన్నికను నిర్వహించారు. టీటీడీసీ కేంద్రానికి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.టీటీడీసీ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి వీవో అధ్యక్షులు మల్లగుల్లాలుపడ్డారు. రెండు వర్గాలుగా చీలిపోయారు. పాత అధ్యక్షురాలు, కుశాలపురం వీవీ అధ్యక్షులు పైడి రాజులమ్మ, టీడీపీ మద్దతుదారు ఎస్‌ఎంపురం వీవో అధ్యక్షురాలు ఎస్.పద్మ, కాంగ్రెస్ మద్దతుదారు, కేశవరావుపేట వీవో అధ్యక్షురాలు పైడికళావతి పోటీ చేసేందుకు తముందుకొచ్చారు.
రాజులమ్మకు మద్దతుగా ఒక్కరూ ముందుకు రాలేదు. కళావతి, పద్మకు చెరో 11 మంది మద్దతు తెలిపారు. రాజులమ్మ మద్దతు తెలపడంతో ఒక వోటుతేడాతో టీడీపీ మద్దతుదారైన పద్మను అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. పద్మకు మద్దతుగా నిలిచిన ఫరీదుపేట వీవో అధ్యక్షురాలు తాను ఎవరికీ మద్దతు తెలపలేదని, తాను పోటీ చేస్తానని చెప్పడంతో కథ మొదటికొచ్చింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ మద్దతుదారులు సద్వినియోగం చేసుకున్నారు. పాత అధ్యక్షురాలైన రాజులమ్మకు పదవి ఇస్తామని చెప్పారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులతో పాటు ఫరీదుపేట వీవో, పాత అధ్యక్షురాలు మొత్తం 14 మంది ఒక్కటవడంతో టీడీపీ మద్దతుదారులు కంగు తిన్నారు. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పినా అంగీకరించకుండా టీడీపీ మద్దతుదారులు ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం 14 మంది వీవో అధ్యక్షులు పాతకార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తీర్మానించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో అధికారులను తొత్తులుగా వాడుకుంటున్నారన్నారు. ఒక సారి ఎన్నిక జరిగిందని అధ్యక్షురాలిని అధికారులు ప్రకటించారని, కానీ తర్వాత నిబంధనలను తుంగలో తొక్కారని వారు ఆరోపించారు.
Advertisement
Advertisement