సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)– 2002, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్‌ఇఎంఎ–ఫెమ) –1999 ప్రకారం కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలపై దృష్టి సారించింది. రాజధాని భూ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరనే విషయాలతో పాటు పలు కోణాల్లో ఆరా తీస్తోంది. చంద్రబాబు హయాంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్య నేతలు సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసి భూ కుంభకోణానికి పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఏపీ సీఐడీకి అప్పగించడం.. ఈ కుంభకోణం నిజమేనని సీఐడీ నిర్ధారించడం.. కేసులు నమోదు చేసింది. ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉండటంతో ఈడీ, ఆదాయ పన్ను శాఖ(ఐటీ)లకు ఏపీ సీఐడీ నివేదించిన సంగతి విదితమే.
చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఈడీ కేసు బదిలీ
రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఈడీ.. ఏపీ సీఐడీని కోరింది. ఈ బాగోతంపై ఇప్పటికే సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్ డి.సుశీల్‌కుమార్‌కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ కేసును హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి బదిలీ చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఈడీ జేడీ (హైదరాబాద్) అభిషేక్ గోయల్ సీఐడీ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిశీలించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం సీఐడీని సంప్రదించగా, మంగళవారం మెయిల్ చేశారు.
కీలక ఆధారాల కోసం ఈడీ ఆరా..
ఈడీ జేడీ అభిషేక్ గోయల్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి అన్ని పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాజధాని భూముల కొనుగోళ్లు, వాటిలో అక్రమాలు, పెద్ద ఎత్తున డబ్బు మారకం, తెల్లకార్డుదారులు కోట్లు పెట్టి భూముల కొనుగోలు వెనుక ఉన్న వారెవరు?.. నల్ల డబ్బు చేతులు మారిందా, విదేశాల నుంచి హవాలా మార్గాల్లో డబ్బు వచ్చిందా.. రూ.10 కోట్లకు మించి భూములు కొనుగోలు చేసిన వారి వివరాలేమిటి లాంటి తదితర వివరాలు కోరినట్టు తెలిసింది. బెదిరింపులకు పాల్పడి భూములు తక్కువ ధరకు కొట్టేయడం, మోసం చేసి భూములు రాయించుకోవడం, చంపుతామనే బెదిరింపులు, కిడ్నాపులు, ప్రలోభాలు తదితర కీలక సమాచారంపై ఆరా తీసినట్లు సమాచారం. రాజధాని అమరావతిలో చోటు చేసుకున్న అక్రమాలపై 2015 నుంచి 2019 వరకు ఏమైనా కేసులు నమోదు అయ్యాయా? వాటికి సంబంధించిన వివరాలను ఈడీ కోరినట్టు తెలిసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌లో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరు.. అనే వివరాలపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. వీటన్నింటిపై సీఐడీ వెంటనే వివరాలు అందించినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రత్యక్ష పాత్ర ఎవరిది? వెనకుండి నడిపిందెవరు?
Published Wed, Feb 5 2020 4:21 AM | Last Updated on Wed, Feb 5 2020 7:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment