
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.
వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ప్రశ్నపత్రం మోడల్‌లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచే నామినల్ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు.
జూన్ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు
డీఎస్సీ నియామకాలను జూన్ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment