ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో సమైక్య ఉద్యమం నిరసనల సెగలు కక్కుతున్నాయి. రేపటి నుంచి జిల్లాలోని విద్యాసంస్థలన్ని నిరవధికంగా బంద్ పాటించాలని ఉద్యోగ జేఏసీ ఆదివారం ఇక్కడ పిలుపు నిచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెను ఉధృతం చేస్తామని చిత్తూరు జిల్లాల్లోని వివిధ జేఏసీ సంఘాలు వెల్లడించాయి.
సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని జేఏసీ సంఘాలు ఆరోపించాయి. ఆ నేపథ్యంలో ఈ నెల 6, 7వ తేదీల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధుల నివాసాలు, వారి కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ తెలిపింది.
అయితే జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. తిరమలకు మాత్రం కొన్ని పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి. దాంతో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.