ఒరేయ్ ఎంకిగా మన పరిస్థితి ఏందిరిట్టా తయారైంది. ఆనాడు ఆ అయ్యగారిని (రావెల కిషోర్‌బాబు) తీసకొచ్చి మననెత్తిన కూకోబెట్టారు. ఏదో సుడి ఉండి గాలివాటంతో గెలిసిండు. నడమంత్రపు సిరి నడిసొచ్చినట్టు అయ్యోరు ఏకంగా అమాత్యుడయ్యిండు. ఆ రావెల సారేమో గద్దెనెక్కించినన మనల్ని ఒదిలేసి పద మూడు జిల్లాలు పదమూడు జిల్లాలంటూ రాష్ట్రమంతా చక్కర్లు కొట్టేశారు. నియోజకవర్గంలో పార్టీని గాలికొదిలేసిండు. వర్గాలు చేసి, కుంపట్లు పెట్టి మన క్యాడర్‌ను ముక్కలు చేసిండు. సాపకింద ఉన్న అసమ్మతి సెగని పైకిలేపిండు. అంతన్నాడు.. ఇంతన్నాడు.. తుర్రుమంటూ పక్క పార్టీలోనికి ఎగిరిపోయిండు. ఇప్పుడే మనం ఏమిసేతురా ఎంకిగా.. ఏమి సేతు
కొత్త పక్షి కోసం..
ఇదీ ప్రత్తిపాడు దేశంలో తెలుగు తమ్ముళ్ల మనోవ్యథ. కాదు కాదు రొద. అవును పార్టీలో నాలుగున్నరేళ్ల పాటు హల్‌చల్ చేసిన మాజీ మంత్రి, తాజా మాజీ శాసన సభ్యుడు రావెల కిషోర్‌బాబు పార్టీ వీడి వెళ్లిపోవడంతో సేనాని లేని సైనికుడిలా పార్టీ పరిస్థితి తయారైంది. రావెల కిషోర్‌బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో మరో దళిత నాయకుడు ఇక్కడ ఎదగకుండా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. అదేవిధంగా టీడీపీలో ప్రధాన భూమిక పోషించే కీలక సామాజిక వర్గం నాయకుల ఆధిపత్యానికి సైతం గండికొట్టారు. ఈ తరుణంలో నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో దళిత నాయకులు పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ అధినాయకత్వంతో పాటు క్యాడర్ కూడా కొత్త పక్షి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.
ఫ్లెక్చీల్లోనే నాయకులు..
అరే లింగా.. ఇది ఇన్నావా. మన పార్టీ పొజిషన్ ఎంత దయనీయంగా ఉందో. మనూళ్లో బస్టాండు దగ్గర ఒక నాయకుడు, సినిమా హాల్ ఎదురు ఇంకోకాయన, అంకమ్మగుడికాడ మరొకసారు.. పెద్దపెద్ద ఫ్లెక్చీలు కట్టేచారు. ఇప్పటిదాకా ఆళ్లను చూడటం కూడా లేదు. కనీసం పేర్లు కూడా ఇన్నది లేదు. ఉన్నపళ్లంగా వీళ్లంతా ఏడనుంచో ఊడి ఈడపడ్డారు. ఒక్కరిదీ మన నియోజకవర్గం కూడా కాదాయే. రాయెల సారు పోయి ఇన్ని దినాలవుతున్నా ఒక్కనాడైనా ఆ ఫ్లెక్చీల్లో ఉన్న నాయకులు మనకు కనిపించిడ్రా అంటే అదీ లేదు. వాళ్లు ఫ్లెక్చీల్లోనే నాయకులేమోరో ఎంకిగో. మన నియోజకవర్గంలో ఉన్న ఒక్క దళిత నాయకుడినీ పార్టీ అధిష్టానమేమో పట్టింసుకుంటున్నట్లు లేదు ఏమీ సేతురా లింగా.
మళ్లీ మన నెత్తినే పెడతారేమో..
ఓరేయ్ లింగా. మన చంద్రాలు సారు మళ్లీ పవనాల సార్‌తో కలుత్తే తప్పేంటి. కలిసి పోటీచేత్తే తప్పేంటని ప్లేటు మారుత్తుండు. ఒకాళ అదే జరిగితే మనోళ్ల సంగతేంటి. ఇప్పుడుదాకా మన రావెలోరిని పార్టీ నుంచి వెళ్లిన నాటి నుంచి తిట్టిపోత్తన్నారు. శుధ్దంటూ ఇగ్రహాలు కడిగిపారేశారు. ఒకాళ చంద్రాలు సారు జనసేనతో కలిత్తే,, పత్తిపాడులో మళ్లీ రావెల గారికిత్తరేమో. అప్పుడు మళ్లీ మనోళ్లంతా ఆయన దగ్గరకెల్లి ఒంగిఒంగి దండాలెట్టాల. ఆయనకే ఓట్టేయ్యింసాలా. ఏమోరా సత్తి జరిగినా ఆచ్చర్యం అక్కర్లేదు. పూటకోమాట మారుతున్న మన చంద్రాలు సారు ఏం చేత్తరో ఆ దేవుడికే ఎరుక.
ఆళ్లంతా ఏరిరా..?
అరేయ్ సత్తి అప్పుడు రావెల సారున్నప్పుడు ఆయన కారెనక కార్లలో తిరుగుతూ, పెద్ద పెద్ద కాంటాక్టులు చేసినోల్లంతా ఏమయ్యిండ్రు. ఆయన పోయినాక ఒక్కరూ అగపడట్లేదు. అజ్ఞాతంలోకి పోయిండ్రా లేక ఆళ్లు కూడా పార్టీ మారుతుండ్రా ఏంటి. అదీ నిజమేరా లింగా.. అప్పుడు ఆయనున్నప్పుడు ఆళ్లు చేసిన హడావిడీ మామూలుగా లేదు. నల్లకళ్లద్దాలు, ఖరీదైన కార్లలో తిరుగుతూ మామలుగా సందడి సేయలేదు. అంతేకాదురోయ్ మండలాల్లో మనం ఎన్నుకున్న నాయకులు కూడా రావెలంత వీరుడూ, సూరుడూ లేడని ఇప్పుడేమో కొత్త పాట అందుకున్నారు. 2014కు ముందేమో కందుకూరి వీరయ్య వద్దన్నారు.. ఇప్పుడేమో వీరయ్యకే టిక్కెట్టిమ్మంటుండ్రు. మనోళ్లు దేనికైనా సమర్థులేరా ఎంకిగో.
Comments
Please login to add a commentAdd a comment