ఎన్నికల కోడ్ కూసింది. మరి కొద్ది రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. ఒక సిట్టింగ్ ఎంపీ, మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పార్టీ అధిష్టానం పెండింగ్‌లోనే ఉంచింది. ఒక వైపు గ్రూపుల గోల, మరోవైపు అధిష్టానం నాన్చుడు ధోరణితో టిక్కెట్టు ఆశిస్తున్న వారిలో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీలో నెలకొన్న తీరుతో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు గందరగోళానికి గురవుతున్నారు.
సాక్షి, గుంటూరు: జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. రాజధాని జిల్లా అయిన గుంటూరులో అధికార పార్టీ ఇంత వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపుల గోల నెలకొంది. ఒక ఎంపీ, ఏడు ఎమ్మెల్యేల సీట్లు మినహా మిగతా అన్నింటినీ పార్టీ అధిష్టానం పెండింగ్‌లో ఉంచి ఎటూ తేల్చకపోవడంతో పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ తమ అభ్యర్థిత్వాన్ని తేల్చకుండా గందరగోళ పరిస్థితికి తెరతీస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక పార్లమెంట్, ఐదారు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, మిగతా రెండు పార్లమెంట్ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో ఉంచారు. పెండింగ్‌లో ఉంచిన ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు గ్రూపులుగా విడిపోయి తన్నులాటకు దిగుతుండటంతో ఒక వర్గానికి టిక్కెట్టు ఇస్తే మరో వర్గం దూరమవుతుందనే భయాందోళనలో టీడీపీ అధిష్టానం సీట్లపై ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తోందనే వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
జిల్లాలో మూడు బాపట్ల, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన టీడీపీ, మిగతావాటిని పెండింగ్‌లో ఉంచింది. గుంటూరు ఎంపీగా మరోసారి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌నే పోటీకి దింపిన చంద్రబాబునాయుడు చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, తెనాలి, రేపల్లె, పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇచ్చారు. పెదకూరపాడు, తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి మళ్లీ టిక్కెట్టు ఇచ్చే అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలోనూ, రావెల కిషోర్‌బాబు జనసేన పార్టీలోనూ చేరడంతో ఆ రెండు చోట్ల సరైన అభ్యర్థులు దొరక్క మల్లగుల్లాలు పడుతున్నారు. సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే అంశంపై టీడీపీ అధిష్టానం తేల్చుకోలేకుండా ఉంది. ఆయన్ని నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయించాలా, లేక నరసరావుపేట పార్లమెంట్‌కు పంపి ఆ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలా అన్న ఆలోచనల్లో చంద్రబాబు ఉండటం వల్లే ఇక్కడ అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసినట్లు సమాచారం.
కోడెల కుమారుడు, కుమార్తెలపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలతోపాటు, ఆ రెండు నియోజకవర్గాల్లో వారిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోడెలను అసెంబ్లీకి కాకుండా ఎంపీగా పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉండటంతో ఆయన్ను పక్కన పెట్టి అక్కడ వేగేశన నరేంద్రవర్మరాజు, లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రావణ్‌కుమార్ టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామంటూ ఓ వర్గం, ఆయనకు టిక్కెట్టు ఇవ్వకుంటే సహించేది లేదంటూ మరో వర్గం బహిరంగ సమావేశాలు నిర్వహించి ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతుండటంతో అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలతోపాటు, సొంత పార్టీలోనే అసమ్మతి ఎక్కువ అవడంతో ఆయన్ను మార్చి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.
మంగళగిరి నియోజకవర్గంలో సైతం ప్రస్తుతం ఇన్‌చార్జి గంజి చిరంజీవిని పక్కన బెట్టి అదే సామాజికవర్గంలో మరొకరికి టిక్కెట్టు ఇవ్వాలని ఓ వర్గం, కాపు లేదా కమ్మ సామాజికవర్గాలకు టిక్కెట్టు కేటాయించాలంటూ మరో వర్గం పావులు కదుపుతుండటంతో అక్కడా అభ్యర్థి ఎంపిక టీడీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడులో గ్రూపుల గోల ఎక్కువగా ఉండటం టీడీపీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనే విషయం ఎటూ తేల్చుకోలేక అధిష్టానం పెండింగ్‌లో ఉంచడంపై ఆపార్టీ నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మాచర్లలో చివరి వరకూ నాన్చుడే..
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక ప్రతిసారీ చివరి నిమిషం వరకు తేల్చకుండా నామినేషన్ చివరి రోజు బీఫారాలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు తూర్పు నియోజకవర్గం సైతం వైఎస్సార్ సీపీకి బలమైన నియోజకవర్గం కావడంతో ఈసారి ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న మద్దాళి గిరిని పక్కనబెట్టి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సామాజికవర్గం నుంచి సరైన అభ్యర్థి దొరక్క పెండింగ్‌లో పెట్టారు. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీన ముగుస్తుంది. అయితే ఇంత తక్కువ సమయం ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలంటూ ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రజల్లో పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే అభ్యర్థుల ఎంపిక కూడా చేపట్టలేని పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఉండటం వచ్చే ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అంశమని సొంత పార్టీ నేతలే అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment