
సాక్షి, అమరావతి : ఇష్టానుసారం ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం కుదరదని, అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా రివిజన్, సవరణలు, మార్పులు చేర్పుల సందర్భంగా మృతిచెందిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే అందుకు సవివరమైన వాస్తవ కారణాలుండాలని.. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించకుండా ఏ ఒక్క ఓటరు పేరూ తొలగించరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఎటువంటి తనిఖీలు లేకుండా ఇష్టానుసారం ఓటర్ల పేర్లను తొలగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రివిజన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా రివిజన్‌తో పాటు మృతిచెందిన వారి పేర్లు, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపుతో పాటు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించింది. అవి..
- ఓటర్ల జాబితాలో రెండేసి చోట్ల పేర్లు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించాలి. ఇందుకు సంబంధించి చెక్‌లిస్ట్‌ను రూపొందించాలి. అనంతరమే ఆ ఓటరు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటరుగా కొనసాగించి.. మరోచోట ఉన్న అతని ఓటును తొలగించాలి. క్షేత్రస్థాయి తనిఖీలో ఓటరు ఒకచోట నివసించడం లేదని తేలితే అతని నుంచి ఫాం–7ను తీసుకున్న తరువాతే జాబితా నుంచి అతని పేరును తొలగించాలి.
- శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే.. వారు ఎక్కడికి వెళ్లారో సంబంధిత బూత్ స్థాయి అధికారి తెలుసుకోవాలి. వలస వెళ్లిన ఓటరుకు నోటీసు జారీచేయాలి. వలస వెళ్లినట్లు ఫాం–7ను అతని నుంచి తీసుకున్న తరువాతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలి. ఓటరు ఎక్కడికి వలస వెళ్లారో బూత్‌స్థాయి అధికారి తెలుసుకోలేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఉన్న ఇంటి చిరునామాకు నోటీసు అంటించాలని, ఏడు రోజుల అనంతరం.. ఆ ఓటరు కుటుంబ సభ్యులుంటే వారి వాంగ్మూలం తీసుకోవాలని, కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోతే ఇద్దరు పక్కంటి వారి నుంచి సాక్ష్యం తీసుకున్న తరువాతే జాబితా నుంచి తొలగించాలి.
- సామూహికంగా వలస వెళ్లిన ఓటర్లుంటే, అలాంటి వారు ఎక్కడికి వలస వెళ్లారో తెలియని పక్షంలో స్థానిక దినపత్రికల్లో వారి పేర్లను ప్రచురించాలి. ఏడు రోజుల తరువాత కూడా ఎవ్వరూ స్పందించకపోతే వారి పేర్లను అప్పుడు తొలగించాలి.
- మృతి చెందిన వారి పేర్లను వారి డెత్ సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే జాబితా నుంచి తొలగించాలి. జనన, మరణ రిజిస్టర్ లేదా స్థానిక సంస్థలకు చెందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నుంచి మృతి చెందినట్లు నిర్ధారించుకోవాలి. అలాగే, ఫాం–7 నుంచి ఆయా కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలి. అలాగే, అతను మృతి చెందినట్లు స్థానికంగా ఉన్న ఇద్దరు నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలి.
- ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారి పేర్లను తొలగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేరు రెండుచోట్ల ఉంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్న తరువాతే తొలగించాలి. పొరపాటున గుర్తింపు కార్డుగల ఓటరు పేరు తొలగిస్తే తిరిగి అతని పేరు జాబితాలో చేర్చాలి. ఇందుకు సంబంధించిన రికార్డును నిర్విహించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు గల ఓటరు పేరు తొలగించడానికి ముందు పోస్టు ద్వారాగానీ లేదా ఎస్‌ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా తెలియజేయాలి.
- ఏదేని కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని నిర్ణయిస్తే సంబంధిత అధికారి కార్యాలయంలో ఏడు రోజులపాటు నోటీసు బోర్డులో వారి పేర్లను ఉంచాలి. అలాగే, వారి పేర్లను సీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచాలి. వీటిపై అభ్యంతరాలను ఆహ్వానించాలి. ఆ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా చూపించాలి. అభ్యంతరం వ్యక్తం కాని పేర్లను తొలగించిన తరువాత మళ్లీ తుది జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయాలి. ఓటర్ల తొలగింపు రిజిస్టర్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించాలి.
- మృతి చెందిన వారివి తప్ప.. ఏ రకమైన తొలగింపులనైనా నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయి తనిఖీల తరువాతే చేయాలి. ఇందుకు సంబంధించిన రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి.
- ఎటువంటి తొలగింపులనైనా తహసీల్దారు స్థాయి అధికారే చేయాలి. అంతకు తక్కువ స్థాయి అధికారి నిర్ణయం తీసుకోరాదు. తొలగింపులపై జిల్లా డిప్యుటీ ఎలక్రోల్ ఆఫీసర్ రెండు శాతం, జిల్లా ఎన్నికల అధికారి ఒక శాతం తనిఖీలను నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను పూర్తిగా సేకరించాలి. పోలింగ్ రోజున కమిషన్ వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఓటర్ల జాబితా రివిజన్ టైం టేబుల్
– ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన 01–09–2018
– ఓటరుగా నమోదు దరఖాస్తు, అభ్యంతరాలు 01–09–2018 నుంచి 31–10–2018
– ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిశీలన 30–11–2018లోపు పూర్తి
– డేటా అప్‌డేట్ అండ్ ప్రింటింగ్ సప్లిమెంటరీ వచ్చే ఏడాది జనవరి 3లోగా పూర్తి
– ఓటర్ల తుది జాబితా ప్రకటన 04–01–2019
ఏపీలో తొలగించిన ఓట్ల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి నిబంధనలూ పాటించడంలేదన్న విమర్శలున్నాయి. జిల్లాల్లో ఓటర్లను ఎడాపెడా తొలగిస్తున్న తీరు ఇందుకు అద్దంపడుతోంది. వివిధ జిల్లాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఇలా ఉంది..
వ.నెం. జిల్లా పేరు తొలగించిన ఓట్ల మొత్తం
1. శ్రీకాకుళం 45,000
2. విజయనగరం 14,359
3. విశాఖపట్నం 97,268
4. తూర్పు గోదావరి 19,895
5. పశ్చిమ గోదావరి 9.212
6. నెల్లూరు 2,00,525
7. చిత్తూరు 2,55,093
8. కర్నూలు 65,000
9. అనంతపురం 37,059
10. వైఎస్సార్ జిల్లా సుమారు లక్ష