
ఎంసెట్.. ప్రశాంతం
జిల్లాలోని 29 కేంద్రాల్లో గురువారం ఎంసెట్-2014 ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు ముందే హెచ్చరించడంతో.. చాలామంది గంట ముందే ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చివరి నిమిషాల్లో వచ్చినవారు ఉరుకులు పరుగులతో పరీక్షా హాలులోకి వెళ్లారు. కాగా, జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో.. లోపల అభ్యర్థులకు, బయట వారి తల్లిదండ్రులకు ఎంసెట్ నిజంగానే పరీక్షగా మారింది.
భానుగుడి(కాకినాడ)/ అమలాపురం రూరల్ న్యూస్‌లైన్ : ఒక పక్క మండుతున్న ఎండ.. చెమటలు కారుతూ సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుతామా లేదా అనుకుంటూ విద్యార్థుల పరుగులు... మొత్తం మీద గురువారం జిల్లాలో ఎంసెట్ పరీక్ష ప్రశాతంగా జరిగింది. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎంసెట్ రాస్తే తల్లిదండ్రులు భానుడి పరీక్షను బయట తట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని తేలడంతో చాలా మంది విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రం వద్దకు చేరారు. మరికొందరు విద్యార్థులు ఆఖరి నిమిషాల్లో ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
విద్యార్థుల హాజరు
కాకినాడ ప్రాంతీయ కేంద్రంగా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను 25 కేంద్రాల్లో నిర్వహించారు. కోనసీమలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించారు. కాకినాడ కేంద్రంగా జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో 11,555 మంది విద్యార్థులకు గాను, 10,503 మంది హాజరయ్యారు. 1,052 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన మెడిసిన్ పరీక్ష పది కేంద్రాల్లో నిర్వహించారు. 3051 మంది విద్యార్థ్ధులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 2,852 మంది హాజరయ్యారు.
199 మంది గైర్హాజరైనట్టు పరీక్ష కో-ఆర్డినేటర్, జేఎన్‌టీయూకే ప్రిన్సిపాల్ కొప్పిరెడ్డి పద్మరాజు తెలిపారు. కోనసీమలో అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాల, భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల, అనాతవరంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాల, చెయ్యేరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ పరీక్షకు 2,517 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2354 మంది హాజరు కాగా 163 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 543 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 509 మంది పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు.
తనిఖీలు
హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాలరావు, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ిసీహెచ్ శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోనసీమలో రీజనల్ కోఆర్డినేటర్ వక్కలంక కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తల్లిదండ్రులకు ఇబ్బందులు
విద్యార్థుల తల్లిదండ్రుల కోసం టెంట్‌లను ఏర్పాటుచేసినప్పటికీ ఎండవేడి ఎక్కువగా ఉండడంతో వాటిని ఎవరూ వినియోగించుకోలేదు. కాకినాడ సత్యసాయిసేవా సమితి వారు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు.
విసుగుతెప్పించిన కళాశాలల ప్రచారం
మా కళాశాలలో చేరాలంటే..మా కళాశాలలో చేరాలని వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు పరీక్షా కేంద్రాల వెలుపల నిర్వహించిన ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రులకు విసుగుతెప్పించింది. వారు సీడీలు, పేపర్లను విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందజేశారు.