ఉద్యోగులకు భవిత.. భద్రత.. | Employment Is Security To The People in Nellore | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు భవిత.. భద్రత..

Published Fri, Apr 5 2019 2:34 PM | Last Updated on Fri, Apr 5 2019 2:55 PM

Employment Is Security To The People in Nellore - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భవిత.. భద్రత లభిస్తుందని సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి ఎలా.. ఎంత ప్రయోజనం చేకూరుతుందో ఉద్యోగులు లెక్కల్లో మునిగితేలుతున్నారు. ఇక కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అయితే సమాన పనికి సమాన వేతనాలు లభిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన టీడీపీ ప్రభుత్వ పాలనా తీరుపై కూడా ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకతను చెప్పకనే చెబుతున్నారు.  

టీడీపీ పాలనలో వెట్టి చాకిరి
ఆత్మకూరు: గతంలో తొమ్మిదేళ్లు.. ప్రస్తుతం ఐదేళ్ల టీడీపీ పాలనలో ఉద్యోగులు వెట్టిచాకిరీ చేశారు. ఉద్యోగులపై పనిభారం పెంచడం, అనేక రకాలుగా పనిలో ఒత్తిడి చేయడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో పీఆర్‌సీలు అమలు చేయకపోవడం, ఫిట్‌మెంట్‌ను కుదించడంతో పాటు మధ్యంతర భృతి, ప్రమోషన్లు వంటి వాటిని విస్మరించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించకుండా కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కల్పన సృష్టించారు.

తక్కువ వేతనంతో ఎక్కువ చాకిరీ చేయించుకున్నారు.  నెల నెలా జీతాలకు కూడా అష్టకష్టాలు పడ్డారు. ప్రతి నెల ఓడీకి వెళ్లి జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. పెండింగ్‌ ప్రయోజనాలను వెంటనే క్లియర్‌ చేశారు. ఐఆర్, పీఆర్‌సీలు సకా లంలో అమలు పరిచారు. దశాబ్దాలుగా అరకొర వేతనాలు, పెన్షన్లతో అవస్థలు పడుతున్న వారు వైఎస్సార్‌ హయాంలో ఊహించని స్థాయిలో మెరుగుపడ్డారు.  

నెల్లూరు (పొగతోట): 
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చడంలో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు ఆనంద డొలికల్లో మునిగి తేలుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే 27 శాతం ఐఆర్‌( మధ్యంతర భృతి) పెంపు, సకాలంలో పీఆర్‌సీలు ఇస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచుతామనే హామీతో భవిత, భద్రతపై ధీమా ఏర్పడిందంటున్నారు. నెలకు రూ.50 వేలు స్కేల్‌ ఉండే ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం కలిపితే నెలకు రూ.63,500 స్కేల్‌ వస్తుంది. రూ.1,00,000 తీసుకునే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ కలిపితే రూ 1,27,000 తీసుకుంటారు.

చంద్రబాబు మోసంపై రగిలిపోతున్న ఉద్యోగులు
ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ చేస్తామని నమ్మించి మోసం చేశాడు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులైజేషన్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వంటి హామీలు నెరవేర్చకుండా తక్కువ వేతనాలతో వెట్టిచాకీరి చేయించుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాక 25 వేల కుటుంబాలు నిత్యం మనోవేదనకు గురవుతున్నాయి. రెగ్యులర్‌ చేస్తారని ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు.

అడుగడుగునా అన్యాయం
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకున్నారు. తక్కువ వేతనాలతో అధిక మంది ఉద్యోగులతో పనులు చేయించుకోవచ్చుని కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని చంద్రబాబు ప్రోత్సహించాడు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా ఈ ఉద్యోగులు పని చేస్తున్నారు. వేతనాలు, ఇతర అలవెన్సుల్లో రెగ్యులర్‌ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భారీ తేడా ఉంది.

కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబాలకు ఎటువంటి సహాయం అందడంలేదు. ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పొడిగిస్తున్నామంటూ ప్రభుత్వం జీఓ విడుదల చేసి వేతనాలు చెల్లిస్తున్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఖజానా, ఇరిగేషన్, ఎస్‌ఎస్‌ఏ, విద్యుత్‌ తదితర శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 2003 డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేశారు.

100 శాతం వేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు కల్పిస్తూ ఉద్యోగులను భర్తీ చేశారు. 16 ఏళ్లు పూర్తయిన ఇంత వరకు రెగ్యులర్‌ చేయలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య అరోగ్య శాఖ హెల్త్‌ అసిస్టెంట్లు దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రెండు పీఆర్‌సీలు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 పీఆర్‌సీ అమలు చేయకపోగా జీఓ నంబర్‌ 27ను తీసుకు వచ్చి డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను కన్సాలిడెటెడ్‌ పే కిందకు తీసుకువచ్చారు. జీఓ నంబర్‌ 27తో వందలాది మంది ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా జిల్లాలో 25 వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇబ్బందులు పడుతున్నారు. 

25 వేల మందికి ప్రయోజనం

జిల్లాలో 25 వేల మందికి పైగా కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి తక్కువ వేతనాలతో పని చేస్తూ ఎదుగు బొదుగు లేకుండా ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు రూ. 15 వేలు వేతనం చెల్లిస్తున్నారు. కటింగ్‌లు పోను రూ.13,500 చేతికి వస్తుంది. ఇంటి అద్దె, కుటుంబ పోషణకు వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. వీరందరికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రయోజనం చేకూరుతోంది. 

వేతన సవరణ.. సీపీఎస్‌ రద్దు భేష్‌

వెంకటగిరి: ప్రజారంజకంగా పాలన చేయాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుండడంతో ప్రజలే కాకుండా ఉద్యోగులు సైతం విలవిలలాడుతున్నారని పలువురు విశ్రాంత ఉద్యోగులు అంటున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భతి ప్రకటించడం ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. తాము ఉద్యోగాలు చేస్తున్న సమయంలో సకాలంలో వేతన సవరణ జరగకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని విశ్రాంత ఉద్యోగులు చెబుతున్నారు.

ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు ఎంతో మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తానని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు ఆ హమీని అమలు చేయకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు హెల్త్‌ కార్డులపై తక్షణ వైద్యం, వృద్ధాప్యంలో ఆర్టీసీ చార్జీల్లో రాయితీ, నామమాత్రపు ధరకు గృహవసతి, ఆదాయపు పన్నులో రాయితీ కల్పించాలని , డీఏ బకాయిలు లేని ప్రభుత్వం రావాలని ఉద్యోగులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement