సాక్షి, రాజమండ్రి : అటు మండుతున్న ఎండలు, ఇటు కొత్త సర్కారు యోచన.. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కుంటుపడ్డాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పని దినాలు భారీగా తగ్గాయి. ఈ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌లను ప్రభుత్వం తొలగిస్తుందన్న వార్తలతో వారిలో నెలకొన్న అభద్రత కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రరూపంలో కొనసాగుతున్న వాతావరణమే ఈ పథకం పనులు తగ్గడానికి కారణమని అధికారులు అంటున్నారు.
జూన్ ఒకటి నుంచి ఏడవ తేదీతో ముగిసిన మొదటి వారంలో జిల్లాలోని 58 మండలాల్లో 1.90 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. అంతకు ముందు మే 25 నుంచి 31 తో ముగిసిన వారంలో 1.81 లక్షల మంది పనులకు హాజరయ్యారు. కానీ జూన్ ఎనిమిది నుంచి 14తో ముగిసిన రెండో వారంలో కేవలం 75,766 మందికి మాత్రమే పనులు కల్పించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంతో పోలిస్తే లక్ష మందికి పైగానే కూలీలకు ఉపాధి పనులకు దూరంగా ఉన్నారు.
పలు మండలాల్లో తగ్గిన హాజరు
జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. ఈనెల మొదటి వారం కపిలేశ్వరపురం మండలంలో 3,800 మంది ఉపాధి పనులకు హాజరవగా రెండో వారంలో కేవలం 81 మంది మాత్రమే హాజరయ్యారు. శంఖవరం మండలంలో మొదటి వారంలో 1,250 మంది ఉపాధి పనులు చేయగా రెండో వారంలో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగిలో జూన్ తొలి వారంలో సుమారు 6,500 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో 1,008 మంది మాత్రమే పనులు చేశారని లెక్కలు చెబుతున్నాయి. కొత్తపేట మండలంలో తొలి వారంలో 6,150 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో పనులకు హాజరైన వారి సంఖ్య 1,650 మాత్రమే. జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్న మొత్తం 1,012 గ్రామ పంచాయతీల్లో 515 పంచాయతీల్లో రూపాయి కూడా చెల్లింపులు జరగలేదు. మొత్తం 2,450 జనావాసాలకు 1,725 జనావాసాల్లో పనులు జరగలేదు.
ఈ నెల ఆరంభం నుంచి ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. మే నెలలో సైతం కాయని ఎండలు జూన్ రెండో వారంలో కాశాయి. ఈ వారంలో గరిష్టంగా 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పనులకు హాజరయ్యేందుకు కూలీలు భయపడ్డారని అధికారులంటున్నారు. మరో వంక తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో ఉపాధి ఫీల్డు అసిస్టెంట్‌లను తొలగించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఫీల్డు అసిస్టెంట్లలో నిస్పృహ, కలవరం నెలకొని, ఆ ప్రభావం కొంతమేరకు పనులపై పడింది.
‘ఉపాధి’కీ తప్పని కాక
Published Fri, Jun 20 2014 1:35 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement