
శివ.. శివా..
ముందస్తు నీటి ఏర్పాట్లు శూన్యం
కృష్ణానదిలో 7.7 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
ముక్కుమూసుకుని మురికి నీటిలోనే స్నానాలు
భక్తుల ఆగ్రహావేశాలు
విజయవాడ : శివయ్య భక్తులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తెల్లవారుజామున శివరాత్రి పుణ్యస్నానాలు చేద్దామని కొండంత ఆశతో కృష్ణానదికి చేరుకుంటే అడుగడుగునా ఇసుకే ప్రత్యక్షమైంది. మునుపెన్నడూ లేనివిధంగా నదిలో నీటిమట్టం పడిపోవడంతో భక్తులు స్నానమాచరించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా మడుగులా కనిపించిన మురికినీటితోనే ముక్కు మూసుకుని మమ అనిపించారు. కృష్ణానదిలో నీటిమట్టం 7.7 అడుగులు మాత్రమే ఉండడంతో దుర్గాఘాట్‌తో పాటు సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, వీఐపీ ఘాట్‌లలో నీరు బాగా అడుగంటిపోయింది. కేవలం పాదాలు మాత్రమే తడిశాయి. ఆ నీరు కూడా చెత్తాచెదారంతో నిండి ఉంది.
మంత్రి ఇలాకాలో ఏర్పాట్లు ఏవీ..
జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత జిల్లాలోనే భక్తులకు నీటికష్టాలు తప్పడం లేదు. పండుగ వేళ పూర్తిస్థాయిలో పుణ్యస్నానాలు చేసేందుకు నోచుకోలేకపోయారు. ఇరిగేషన్ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జల్లుస్నానాలు చేసేందుకు పోటీ పడ్డారు. తొక్కిసలాట జరగకుండా భక్తులను ఘాట్లలోకి విడతల వారీగా పంపారు. షవర్స్ కింద కేవలం తల తడుపుకొని బయటకు వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. ఒక దశలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, షవర్స్ సరిపోకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ట్యూబులతో భక్తుల పైకి నీళ్లు పంపింగ్ చేశారు.
ప్రమాదపుటంచున భక్తులు
సీతమ్మవారి పాదాలు వద్ద ఘాట్‌లో నీరు లేకపోవడంతో భక్తులు నదీగర్భంలోకి వెళ్లి స్నానాలు చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఊబులు ఉండడంతో భయపడిన దేవస్థానం ఈవో సీహెచ్.నర్సింగరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పరిశీలించారు. భక్తుల తొక్కిసలాట జరగకుండా, ఊబులు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు అప్పటికప్పుడు మెష్‌లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.