ఇదంతా వ్యూహంలో భాగమేనా? | Encounters: is it a part of well planned ? | Sakshi
Sakshi News home page

ఇదంతా వ్యూహంలో భాగమేనా?

Published Tue, Apr 7 2015 1:10 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ఇదంతా వ్యూహంలో  భాగమేనా? - Sakshi

ఇదంతా వ్యూహంలో భాగమేనా?

హైదరాబాద్: ఒకేరోజు.. కొన్ని గంటల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు భారీ ఎన్కౌంటర్లు..మొత్తం మీద 25మంది హతం. ఇందులో ఇరవై మంది ఎర్రచందనం స్మగర్లు కాగా ఐదుగురు ఐఏఎస్ ప్రేరేపిత తీవ్రవాదులు.

తెలంగాణాలో గతం వారం రోజులుగా వరుస సంఘటనలు ఆందోళనకర వాతావరణానికి  తెరలేపాయి. ముందుగా సూర్యపేట బస్టాండ్లో పోలీసులపై తీవ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు  పోలీసుల మరణం. రెండు రోజుల వ్యవధిలో నల్గొండ జిల్లాలోని అర్వపల్లిలో మరో ఎన్కౌంటర్. ఒక కానిస్టేబుల్, ఇద్దరు తీవ్రవవాదుల హతం.  మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలోని జనగామ వద్ద ఎస్కార్ట్ పోలీసుల  కస్టడీ నుంచి  తప్పించుకునే ప్రయత్నంలో బడా ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు  తీవ్రవాదుల హతమయ్యారు.

ఈ  వరుస సంఘనలు తెలంగాణాలో వేగంగా మారుతున్న పరిస్థితులకి అద్దం పడుతున్నాయా? ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒకేసారి వేడేక్కిందా? పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి. సూర్యపేట బస్టాండ్లో  కాల్పులు  జరిపిన తర్వాత తీవ్రవాదులు నల్గొండ జిల్లాలోనే ఎందుకు ఉండిపోయారు. మళ్లీ పోలీసులను ఎందుకు ఢీకొన్నారు. వికారుద్దీన్ను తప్పించే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందా...తమ పథకంలో భాగంగానే నల్గొండ జిల్లాలోనే ఉండిపోయారా? వికారుద్దీన్ తప్పించుకునే ప్రయత్నం ముందుగా పన్నిన వ్యూహంలో భాగమేనా? అవుననే  అంటున్నాయి పోలీసు వర్గాలు.

సూర్యపేట ఘటన తర్వాత నల్గొండ జిల్లాలోనే  దాదాపు 36 గంటలు తీవ్రవాదలు గడపడం కొంత ఆశ్యర్యాన్ని కలగజేసింది. రాష్ట్రాన్ని దాటడం కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు. అయినా ఇద్దరు తీవ్రవాదుల కదలికలు జిల్లాలోనే కనిపించడం పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఏదైనా  దాడికి కుట్ర పన్నారా అనే  అనుమానాలు కలిగాయి. అందుకే  పోలీస్ యంత్రాంగం  పూర్తిగా అప్రమత్తమైంది. దాని పర్యవసానమే అర్వపల్లి ఎన్కౌంటర్ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు సాక్షి వెబ్సైట్కి చెప్పారు.


మంగళవారం ఉదయం వరంగల్  జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్ గ్యాంగ్ ఎస్కార్ట్ వాహనం నుంచి  పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఐఏఎస్ ఏజెంట్లను పోలీసులు మట్టుబెట్టారు.    తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపైకి దాడి చేయడం...తమ అనుమానాల్ని మరింత బలపరుస్తోందని ఆ అధికారి  చెప్పారు.

అయితే ఇంకొంతమంది తీవ్రవాదులు  నల్గొండ, వరంగల్ జిల్లాలో తలదాచుకొని ఉండే అవకాశముందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. సిమీ, జీజేఎస్,  ఇండియన్ ముజాహిదీన్ లాంటి మరికొన్ని సంస్థలు తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలు మళ్లీ పాత రోజులను  గుర్తుకు తెస్తున్నాయి.

ఇక ఇటు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా శేషాచలం  అడవుల్లో ఎన్కౌంటర్.. ఇరవైమంది స్మగ్లర్ల కాల్చివేతకు దారి తీసింది. పోలీసులను, అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల మెరుపుదాడితో ఒక్కసారిగా వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది.  తిరుమల కొండల దిగువ భాగాన జరిగిన ఎన్కౌంటర్  కలకలం రేపింది. ఒకేసారి ఇరవైమంది స్మగ్లర్ల ఎన్కౌంటర్ అవడం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఎన్ని దాడులు జరిగినా ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ వరుస  సంఘటనలు ఇంకెన్ని మలుపులు  తిరుగనున్నాయోననే భయాందోళనలు నెలకొన్నాయి.


సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం                       



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement