బొబ్బిలి రూరల్ : ఈ నెల మూడో వారం లేదా నెలాఖరుకల్లా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని వ్యవసాయానికి అందిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంతో కలిసి అలజంగి గ్రామం వద్ద తోటపల్లి కాలువ గట్లు, అక్విడెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించారు. కాలువల్లో మట్టి పడిపోతోందని, పనుల్లో నాణ్యత లేదని తెలిపారు. అనంతరం పనుల వివరాలను ఎస్‌ఈ తిరుమలరావును కలెక్టర్ నాయక్ అడిగి తెలుసుకున్నారు.
కొన్నిచోట్ల పనులు జరుగుతున్నందున అనుకున్న విధంగా ఆగస్టు 15కల్లా నీరు ఇవ్వలేకపోతున్నామని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ నెల మూడో వారంలో లేదా నెలాఖరుకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. చింతాడ, పిరిడి గ్రామాల్లో కూడా గట్ల మట్టి కాలువల్లో పడిపోతున్న విషయం విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామన్నారు. వీరివెంట తోటపల్లి ఎస్‌ఈ తిరుమలరావు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలు ఉన్నారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు తెర్లాం మండలం చిన్నయ్యపేట, బాడంగి మండలం అల్లుపాల్తేరు వద్ద తోటపల్లి అక్విడెక్ట్ పనులను కూడా పరిశీలించారు.
నెలాఖరుకు ‘తోటపల్లి’ గల గల
Published Wed, Aug 5 2015 1:16 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement