ఖమ్మం, న్యూస్‌లైన్ :
ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. 2013 -ఎంసెట్ సీట్ల వివరాలను ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రకటించింది. జిల్లాలో 25 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 11,140 సీట్లు ఉన్నాయి. వీటిలో రెండు కళాశాలలు మైనార్టీ కోటా కౌన్సెలింగ్‌లో ఉండగా 23 కళాశాలల పరిధిలో తొలివిడతలో 3,722 సీట్లు మాత్రమే నిండాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడోవంతు సీట్లు మిగిలి ఉన్నాయి. అయితే యాజమాన్య కోటా (బీ కేటగిరి) సీట్ల భర్తీ ప్రకియ ఇంకా ప్రారంభం కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు.
జిల్లాలో ఎంసెట్ - 2013లో 9 వేల మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించారని అధికారులు చెపుతున్నారు. అయితే కౌన్సెలింగ్ ఆలస్యంగా నిర్వహించడంతో చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలలోని డీమ్డ్ విశ్వ విద్యాలయాల్లో చేరారు. దీంతోపాటు మహా నేత వైఎస్ మరణాంతరం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, ఆంక్షలు విధించడంతో గతంలో ఇంజనీరింగ్‌లో చేరిన పలువురు పేద
విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత ఇబ్బంది పడటం ఎందుకని మరికొందరు డిగ్రీ కోర్సుల్లో చేరారు. దీంతో ఇంజనీరింగ్ కళాశాలలకు పెద్ద దెబ్బ తాకినట్లయింది.
ప్రశ్నార్థకంగా పలు కళాశాల భవితవ్యం..
కనీసం 50 శాతం సీట్లు భర్తీ అయితేనే ఆ కళాశాలలు మనుగడ సాధించే అవకాశం ఉండటంతో జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో సీట్ల కోసం ఆప్షన్లు పెట్టుకున్న వారు తక్కువగా ఉండడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. 300 సీట్లు ఉన్న కళాశాలలో 50 మంది కూడా చేరకపోతే నడపడం ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పరిసర ప్రాంతంలోని ఒక కశాశాలలో 420 సీట్లు భర్తీ కాగా, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న పలు కళాశాలల్లో కొంతమేర మెరుగ్గానే భర్తీ అయ్యాయి. మిగిలిన 8 కళాశాలల్లో కనీసం 100 సీట్లు కూడా భర్తీ కాలేదు. అధ్యాపకుల వేతనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే విద్యార్థులు చేరకపోతే ఏం చేయాలోనని ఆయా కళాశాలల వారు మథనపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కళాశాలలు మూసివేయడం తప్ప చేసేదేమి లేదని ఆందోళన చెందుతున్నారు.
రెండోవిడత కౌన్సెలింగ్‌పై ఆశలు..
తొలివిడతలో సీట్లు భర్తీ కాకపోవడంతో రెండోదఫా కౌన్సెలింగ్‌పై యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. అదికూడా నేటితో(27వ తేదీ) ముగియనుంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో రెండవ విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఎంపిక చేసుకున్న జాబితాను ప్రకటిస్తారు. ఇందులోనైనా తమ కళాశాలను ఎంపిక చేసుకుంటారోనని నిర్వాహకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఇతర రాష్ట్రాలలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చేరడంతో ఆ ఆశలు కూడా నిరాశ అయ్యేలా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సీట్ల కేటాయింపు వివరాలను ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఎస్‌ఎంఎస్ రూపంలో విద్యార్థులకు పంపించింది. కాగా, కనీస సంఖ్యలోనైనా విద్యార్థులను చేర్పించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతో పలు కళాశాలల నిర్వాహకులను పీఆర్వోలను రంగంలోకి దింపి సీట్ల భర్తీకి ప్రయత్నిస్తున్నారు.
మిగులు... దిగులు..
Published Fri, Sep 27 2013 4:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement