ఉపాధికి భరోసా! | Ensuring employment! | Sakshi
Sakshi News home page

ఉపాధికి భరోసా!

Dec 29 2014 3:15 AM | Updated on Sep 2 2017 6:53 PM

ఉపాధికి భరోసా!

ఉపాధికి భరోసా!

వలసలు నివారణే లక్ష్యంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పురుడు పోసుకుంది. కరువు జిల్లా ‘అనంత’లో 7.65 లక్షల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారు.

 వలసలు నివారణే లక్ష్యంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం  పురుడు పోసుకుంది. కరువు జిల్లా ‘అనంత’లో 7.65 లక్షల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయాలని భావిస్తుండడంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో కేవలం 17 మండలాల్లో తప్పా మిగిలిన మండలాల్లో పథకాన్ని తొలగిస్తున్నారని కూలీలు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సాక్షి వీఐపీ రిపోర్టర్ హోదాలో డ్వామా పీడీ ఎ. నాగభూషణం నడుంబిగించారు. ముదిగుబ్బ మండలంలోని సానివారిపల్లి, ఎనుములవారిపల్లి, కొండగుట్టపల్లి తదితర గ్రామాలలో పర్యటి ంచారు. కూలీల సమస్యలు విన్నారు. జనవరి నెలాఖరులోగా బకాయి వేతనాలను చెల్లిస్తామని, పని అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే బాధ్యత తనదని ... పనిలేక ఏ ఒక్కరూ పట్టణాలకు వలస పోకూడదని భరోసా కల్పించారు.
 
 నాగభూషణం : ఏమ్మా. బాగున్నారా. నీ పేరేంటి.?
 కూలీ : నా పేరు నారాయణమ్మ సార్. 15 రోజుల నుంచి పనులు పెడుతున్నారు. దీంతో బాగానే ఉన్నాం.
 నాగభూషణం : ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించకపోతే మీకు ప్రత్యామ్నాయం ఏమిటి?
 నారాయణమ్మ : మా ఊళ్లో యవసాయ పనులు తక్కువ. ఎండాకాలంలో కరువు పని మాత్రమే మాకు దిక్కు. లేకుంటే కేరళాకు వెలుతాం. ఇప్పటికే మా ఊళ్లో 50 మంది వరకూ పోయారు. పనులు పెట్టారని తెలిస్తే వారు తిరిగొస్తారు.
 నాగభూషణం : వలస వెళితే ఊరుగాని ఊరు. ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి వారికి కూడా తిరిగి గ్రామానికి రమ్మని చెప్పండి.
 నాగభూషణం : ఏమయ్యా.  పనులు బాగా పెడుతున్నారా.? ఎంత మంది చేస్తున్నారు?
 రాము : 15  రోజుల నుంచి పనులు పెడుతున్నారు. ఇప్పుడు ఐదు శ్రమశక్తి గ్రూపులలోని కూలీలందరం ఇక్కడ పనిచేస్తున్నాం. ఇట్లాగే పని పెట్టాలని చెప్పండయ్యా.
 నాగభూషణం : తప్పకుండా అందరికీ పనులు కల్పించాలని మీ అధికారులకు ఆదేశిస్తా. మీ
 పనిరోజులు పూర్తయినా సరే వాటర్‌షెడ్ గ్రామాల్లో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటా.
 నాగభూషణం : ఏమయ్యా. నీకు సమస్యలేమైనా ఉన్నాయా?
 గణేష్ : 2006 నుంచి ఉపాధి పనులకు వస్తున్నా. 100 రోజులు మాత్రమే పనిదినాలు అంటున్నారు. ఆ తర్వాత ఉపాధి పనికి రాకూడదని చెబుతున్నారు. దీనివల్ల మాలాంటోళ్లు ఇబ్బందులు పడుతున్నాం. 150 రోజులు చేస్తే బాగుంటుంది.
 నాగభూషణం : ఏమయ్యా. నీ పేరేమిటి? ఉపాధి పనులు లేనప్పుడు ఏ పనికి వెలతావు?
 కూలీ : నాపేరు రహంతుల్లా సార్. కరువు పని లేకపోతే వ్యవసాయ పనులకు వెలుతాను. ఆ పనులు లేకపోతే ఇంటి దగ్గర ఉండాల్సిందే.
 నాగభూషణం : రోజూ నీ కూలీ ఎంతో తెలుసుకున్నావా.?
 రహంతుల్లా : నాకు తెలియదు సార్. రోజూ పనికి వస్తా. వారంనాపొద్దు అందరం పంచుకుంటాం. ఎంత వస్తే అంత తీసుకుంటా.
 నాగభూషణం : ఉపాధి కూలీల దినసరి వేతనం ఒకప్పుడు రూ. 149 ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 169 చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుంది. జనవరిలోగా గతంలో మీరు చేసిన పనులకు రూ. 20 చొప్పున బకాయి వేతనం చెల్లిస్తాం.
 నాగభూషణం : ఏమ్మా. ఉపాధి పథకం వలన మీరు ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు.?
 పఠాన్ వన్నూర్‌బీ : సార్. మాకు పని లేకపోతే వలస పోవాల్సిందే. దీంతో వలస పోకుండా గ్రామాల్లో ఉన్నాం. మా ఊరు నుంచే పతి సంవత్సరం  60,70 కుటుంబాలు పోయేటోళ్ళం. ఈ పథకం వలన గామంలోనే పనులు దొరుకుతున్నాయి.
 నాగభూషణం : ఏమయ్యా పనుల వద్ద అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారా?
 వెంకట్రాముడు : రోజూ ఒక్కడికి నూరు మంది వరకూ పనులకు వస్తున్నాం. నీళ్లు తెప్పిస్తున్నారు. ఎండ లేకపోవడంతో పట్ట(షామియానా) తెచ్చుకోలేదు.
 నాగభూషణం : ఏమ్మా. ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు సరిపోతున్నాయా? డబ్బులన్నీ దేనికి ఖర్చు చేస్తున్నారు.?
 రత్నమ్మ : మా ఆయన..నేను ఇద్దరం కష్టపడుతున్నాం. ప్రభుత్వం నుంచి వస్తున్న కూలీ డబ్బులు ఇంట్లోకి సరిపోతున్నాయి. పిల్లలను చదివించుకుంటున్నాం. ఇబ్బంది లేకుండా జరిగిపోతోంది. ఏమంటే గతంలో చేసిన పనులకు డబ్బులు ఇప్పటి రాలేదు?
 నాగభూషణం : ఫినో ఏజెన్సీ తప్పుకోవడంతో పోస్టాఫీసు ద్వారా డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేశాం. దీని వల్ల ఆలస్యమయింది. జనవరి నెలాఖరులోగా బకాయి డబ్బులన్నీ చెల్లిస్తాం. జనవరి నుంచి సక్రమంగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయి.
 నాగభూషణం : ఏం పెద్దాయన నువ్వూ పనికొచ్చావా? అందరితో పాటు చేయగలవా?
 బికారి (వయస్సు 60 సంవత్సరాలు): సార్ పని వరకూ భయం లేదు. అందరితో పాటు చేయగలను. పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాలాంటి వారి కోసం కొంచెం సులభంగా ఉండే పనులు పెడితే బాగుంటుంది.
 నాగభూషణం : ఏమ్మా. పనులు గట్టిగా ఉన్నాయి కదా? నీకు ఏమి ఇబ్బంది లేదా?
 గాయత్రి : కందకాలు తీయాలి కాబట్టి లోపలి నుంచి రాళ్లు వస్తున్నాయి. భూమి గట్టిగా ఉంది. అయినా పర్వాలేదు. మగవారితో సమానంగా కూలీ తీసుకుంటున్నా.  
 నాగభూషణం : ఏమయ్యా. నీకు ఏమైనా సమస్యలున్నాయా?
 ఓలప్ప : పనుల వద్ద మాకు ఏమి సమస్యలు లేవు. రాను పోనూ చార్జీలు రూ. 30 అవుతోంది. దీంతో ఇబ్బంది అవుతోంది.
 నాగభూషణం : పని కల్పించే ప్రదేశం ఐదు కిలోమీటర్లు దాటితే ప్రభుత్వం నుంచి అదనంగా కూలీ రేటు పెరుగుతుంది. అంతే తప్పా చార్జీలు ఇవ్వడానికి పథకంలో వెసులుబాటు లేదు.
 నాగభూషణం : ఉపాధి పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నావు.?
 శ్రీనివాసులు(పొలం యజమాని) : ఉపాధిహామీ పథకం నాకు ఎంతో మేలు చేసింది. కొన్నేళ్ల నుంచి బీడుగా ఉన్న భూమిలో మామిడి మొక్కలు నాటాను. ప్రస్తుతం జల సంరక్షణ పనులు కింద పొలం చుట్టూ కందకాలు తవ్విస్తున్నా. ఇది పొలంకు కంచెలా ఉపయోగపడుతుంది.
 నాగభూషణం : శ్రమశక్తి సంఘాలను అభివృద్ధి చేస్తున్నావా? ఎన్ని రోజుకొకసారి సమావేశం నిర్వహిస్తున్నావ్?
 అల్లాబకాష్ (మేట్ ) : గ్రామంలో 20 గ్రూపులున్నాయి. ప్రతి రెండు మూడు నెలలకొకసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం.
 నాగభూషణం : అట్లా కుదరదు. ప్రతి వారం శ్రమశక్తి సంఘాల సమావేశం పెట్టుకోవాలి. దీని వలన కూలీల సమస్యలు తెలుసుకోవడానికి సులభతరంగా ఉంటుంది. గ్రామం నుంచి పనిలేక వలస పోయారంటే నీవే బాధ్యత వహించాలి.
 నాగభూషణం : ఏమయ్యా పండ్ల తోటల పెంపకం ఏ విధంగా ఉంది? మొక్కలన్నీ బతికాయా?
 రాముడు (రైతు, ఎనుములవారిపల్లి): బీడుగా ఉన్న పొలంలో ఉపాధి పథకం ద్వారా పండ్లతోటల పెంపకం చేపడుతున్నా. పొలంలో తవ్విన ఫారంఫాండ్‌లో ఇప్పటి నీరు పుష్కలంగా దొరుకుతోంది. దీంతో చెట్లన్నీ కాపాడుతున్నా. ఏ ఒక్కటీ చనిపోలేదు.
 నాగభూషణం :  మూగజీవాలకు ఫారంఫాండ్ ఉపయోగపడుతోందా?
 కొండప్ప (గొర్రెల కాపరి, కొండగుట్టపల్లి) : సార్. నాకు 70 గొర్రెలు ఉన్నాయి. చుట్టుపక్కల వెతికినా నీరు లేదు. దీనిపై ఆధారపడే జీవాలు సాకుతున్నా. మంచి ఆదాయం పొందుతున్నాం.
 నాగభూషణం : గొర్రెల సంరక్షణలో ఏవైనా ఇబ్బందులు పడుతున్నారా?
 జయప్ప(గొర్రెల కాపరి) : ఈ నెలరోజులు పోతే గొర్రెలకు ఎక్కడా తినేందుకు మేత కూడా దొరకదు. ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గ్రాసం, దాణా, వైద్య సదుపాయం కల్పించాలి.
 నాగభూషణం : సమగ్ర వాటర్‌షెడ్ పథకంలో జీవనోపాదుల పెంపు కార్యక్రమం ద్వారా దాణా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటా.
 పనిదినాలు పెంచాలని
 
 ప్రభుత్వానికి ప్రతిపాదన
 ఉపాధి హామీ పథకంలో 100 రోజులు మాత్రమే పని కల్పన నిబంధనతో అనర్హులుగా మిగిలిపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేయడంలో డ్వామా పీడీ నాగభూషణం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా కరువు జిల్లా అనంతలో ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు.
 
 ఇప్పటి వరకూ ఐదెకరాలలోపు ఉన్న సన్న,చిన్న కారు రైతులకు పండ్లతోటల పెంపకం, ఇతర సంక్షేమ కార్యక్రమాలలో లబ్ధి పొందేందుకు అవకాశముందని తెలిపారు. అయితే ఇది పదెకరాల వరకూ పెంచాలని జిల్లా పరిషత్ జనరల్‌బాడీ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. రోజూ రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
 
 ఉపాధి పథకంపై కూలీలు పెట్టుకున్న అపోహలన్నీ చైతన్య రథం కార్యక్రమం ద్వారా తొలగిస్తామని అన్నారు. జిల్లాలో 63 మండలాల్లోనూ పథకం ఉంటుందన్నారు. సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన బకాయిలు, ఏప్రిల్ నుంచి పెరిగిన రూ. 20 వేతనంతో  మొత్తం రూ. 21 కోట్లు చెల్లించాల్సి ఉందని, జనవరి నెలాఖరులోగా ఈ మొత్తం కూలీల చేతికందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 100 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న వారికి వాటర్‌షెడ్ గ్రామాల్లో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా సిబ్బందిని ఆదేశించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement