పల్లెల్లో ‘బిల్లు’ భూతాలు
ఏళ్లనాటి బకాయిలు చెల్లించమంటూ రైతులకు వేధింపులు
రూ.800 కోట్లకు పైగా వసూలుకు ప్రభుత్వం టార్గెట్
రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేయరాదనే నిబంధన బేఖాతరు
వ్యవసాయ కనెక్షన్ సర్వీసు చార్జీ బకాయిలు పడితే ఇళ్లకూ కరెంటు కట్
గ్రామం మొత్తానికి సరఫరా నిలిపివేస్తుండటంతో రోజుల తరబడి చీకట్లో పల్లెలు
హైదరాబాద్, సాక్షి: వ్యవసాయ కనెక్షన్‌కు సంబంధించి రైతులు బకాయి పడితే ఇంటికి కరెంటు కట్ చేయవద్దని ఈఆర్‌సీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ బకాయిల పేరుతో ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే ఇంధనరంగంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఈఆర్‌సీ మాటలనూ విద్యుత్ సంస్థలు ఖాతరు చేయడం లేదు. కేవలం వ్యవసాయ కనెక్షన్, ఇంటికే కాదు.. ఏకంగా ఆ ఊరికే కరెంటు సరఫరా నిలిపివేస్తున్నాయి.
దీంతో ఆయూ గ్రామాల్లోని వ్యవసాయ కనెక్షన్లతో పాటు ఇళ్లకూ, తాగునీటికీ, వీధి దీపాలకూ సరఫరా నిలిచిపోతోంది. కేవలం బకాయి ఉన్న గ్రామానికి మాత్రమే సరఫరా నిలిచి పోవడం లేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక ఫీడర్ కింద ఒక్క బకాయిలు చెల్లించని గ్రామమే కాకుండా ఆ ఫీడర్ కింద ఉన్న గ్రామాలన్నీ చీకట్లో మగ్గాల్సి వస్తోంది. కరెంటు లేక రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలతో పాటు రబీ నారు కూడా ఎండిపోతోంది.
2004 నుంచీ కట్టాలంట..!
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఒక్కో ఉచిత కనెక్షన్‌కూ సర్వీసు చార్జీ రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ ప్రభుత్వం రైతుల నుంచి ఏనాడూ ఈ మొత్తాన్ని వసూలు చేయలేదు. 2011 ఏప్రిల్ నుంచి ఈ సర్వీసు చార్జీని రూ.30కి పెంచారు. తాజాగా సర్వీసు చార్జీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ప్రభుత్వం రైతుల ఉంచి పాత బకాయిలు వసూలు చేయూలని నిర్ణయించింది.
ఏకంగా 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల్ని కట్టమంటోంది. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని జమచేసి ఇస్తున్నారు. లేదంటే ప్రత్యేకంగా బిల్లులను జారీ చేస్తున్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు నెలకు రూ.20 చొప్పున ఏడాదికి రూ.240 అవుతుంది. 2004 ఏప్రిల్ నుంచి 2011 మార్చి వరకు ఏడాదికి రూ.240 చొప్పున ఏడేళ్లకు రూ.1680 అవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 30 లక్షల కనెక్షన్లకు లెక్కిస్తే ఈ మొత్తం రూ.504 కోట్లు అవుతోంది. ఇక 2011 ఏప్రిల్ నుంచి నెలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఇప్పటివరకు అంటే 2014 డిసెంబర్ వరకు లెక్కిస్తే మొత్తం 33 నెలలకుగానూ నెలకు రూ.30 చొప్పున రూ.990 అవుతుంది. 30 లక్షల కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 297 కోట్లు అవుతుంది. అంటే రైతాంగంపై మొత్తం రూ.801 కోట్ల భారం వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసిందన్నమాట. ఈ మేరకు విద్యుత్ సంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నారుు. ఒక్కో రైతుపై 2004 ఏప్రిల్ నుంచి లెక్కిస్తే మొత్తం పదేళ్లకు గాను పడుతున్న అదనపు భారం మొత్తం రూ.2670 అన్నమాట.
విద్యుత్ చట్టం ఏమంటోందంటే..
విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 56 క్లాజ్ 2 వినియోగదారులకు రక్షణ కల్పిస్తోంది. ‘ఏదైనా వినియోగదారునికి బకాయి విషయాన్ని రెండేళ్లలోపుగా తెలియజేసి వాటిని వసూలు చేసుకునే అవకాశం విద్యుత్ సంస్థలకు ఉంది. అరుుతే సమయం మించిపోతే వసూలు చేయకూడదు. వినియోగదారునికి విద్యుత్ సరఫరాను నిలిపివేయకూడదు’ అని ఈ క్లాజ్ పేర్కొంటోంది. ఒకవేళ దీనికి భిన్నంగా ఇదే చట్టంలో ఎక్కడైనా పేర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెక్షన్ 56 క్లాజ్ 2నే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు తాము బకాయి ఉన్న విషయం ఇప్పటివరకూ తెలియదు. ఇటీవలి కాలం వరకు కరెంటు బిల్లులు జారీ చేయలేదు. కాబట్టి రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేసేందుకు వీల్లేదు.
ఈసారి వర్షాలు బాగా పడ్డాయని వరి పంట కోసం (రబీ) నారు పోసుకున్నా. కానీ ఊళ్లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలేవో కట్టలేదంట. మొత్తం ఊరికి కరెంటు నిలిపేశారు. కరెంటు లేక వరినారు ఎండిపోయింది.
- పెద్దోళ్ల నరసింహులు, గుంటిపల్లి,
వర్గల్ మండలం (మెదక్ జిల్లా)
వరినారు కోసం పొలం దున్ని విత్తనాలేశా. ఇంతలోనే కరెంటు బందయింది. ఏంటని అడిగితే సర్వీసు చార్జీ బకాయిలున్నాయన్నారు. 3 రోజులు కరెంటు లేక విత్తనాలు పాడైపోయాయి
- శ్రీనివాస్, గొట్టిముక్కల,
వికారాబాద్ మండలం (రంగారెడ్డి జిల్లా)