రోజుకు 232 పరిశ్రమలు.. బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చిన్న పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్‌బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. 2013-14 చివరి త్రైమాసికానికి సంబంధించి ఆర్‌బీఐ కొద్దిరోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 2013 నాటికి ఖాయిలాపడిన పరిశ్రమల సంఖ్య 14,964 ఉండగా.. మార్చి 2014 నాటికి వీటి సంఖ్య ఏకంగా 35,876కు చేరుకుంది. కేవలం 3 నెలల కాలంలోనే ఏకంగా 20,912 పరిశ్రమలు ఖాయిలాపడ్డాయి. అంటే రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
పరిశ్రమలశాఖ నివేదిక ప్రకారం ఒక సూక్ష్మ లేదా చిన్నతరహా పరిశ్రమలో సగటున కనీసం 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే 232 పరిశ్రమలు రోజుకు మూతపడ్డాయంటే.. రోజుకు 5,800 మంది కార్మికులు వీధి పాలవుతున్నారన్నమాట. అదేవిధంగా ఈ పరిశ్రమలకు చెందిన రూ. కోట్ల పెట్టుబడి నిరర్ధకంగా మారుతోంది. ఇందుకు కారణం నాలుగేళ్లుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న విద్యుత్ కోతలు-వాతలే కారణమని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
కోతలు- వాతల వల్లే దుస్థితి
నాలుగేళ్ల నుంచి పరిశ్రమల పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. వారంలో సగం రోజులు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కూడా పరిశ్రమలకు వారంలో ఒక రోజుపాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ కోతలతో పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా వచ్చిన ఆర్డర్లను పరిశ్రమలు పూర్తిచేయలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చిన ఆర్డర్లన్నీ వెనక్కి వెళుతున్నాయి. దీంతో పరిశ్రమలు నిధుల రాక నిలిచిపోయింది. ఈ పరిణామాల వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పరిశ్రమలు సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. వరుసగా మూడు నెలలు రుణం చెల్లించకపోతే సంబంధిత పరిశ్రమ రుణాలను నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా పరిగణిస్తున్నారు. బ్యాంకులకు రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్న పరిశ్రమల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్విత అంధకారమే
ఎఫ్‌ఎస్‌ఎంఈ అధ్యక్షుడు ఏపీకె రెడ్డి విద్యుత్ సరఫరాలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్వతంగా పారిశ్రామికవేత్తలకు అంధకారం తప్పదు. ఆర్‌బీఐది అధికారిక నివేదిక. అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమ ఖాయిలా పడకూడదని వ్యక్తిగతంగా అప్పులు చేసి మరీ బ్యాంకులకు రుణాలు తీరుస్తున్నారు. వీటితో కలుపుకుంటే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఇరు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఏపీ, తెలంగాణలో రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు 5,800 మంది కార్మికులు రోడ్డుపాలవుతున్నారు.
-ఆర్‌బీఐ నివేదిక