
ఇప్పట్ల సమీపంలో ఉన్న ఎక్స్‌లెన్స్ కళాశాల
సాక్షి ప్రతినిధి, కడప: అది పేరెన్నికగన్న ప్రతిభ కళాశాల. పులివెందుల సమీపాన ఇప్పట్ల వద్ద ఉన్న దీని పేరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్. అందులో సీటు సంపాదించాలంటే ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాల్సిందే. అలా వడపోత ద్వారా ఎంపిక చేసుకున్న మెరికలకు మరింత పదునుపెట్టి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. కాగా ఈ మహోన్నత లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. పట్టించుకునేవారు లేకపోయే సరికి అధ్యాపకులు సైతం విద్యార్థులను గాలికి వదిలేశారు. మొదట్లో వందశాతం ఫలితాలు సాధించిన ఆ కళాశాల ఈ ఏడాది కేవలం 39శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో గురుకులాలల్లో అట్టడుగు స్థానానికి దిగజారింది.
ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి మంచి ప్రమాణాలున్న ఇంటర్ విద్యతోపాటు, ఎంసెట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల వద్ద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సును నెలకొల్పారు. లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపాన 2006 నవంబర్ 1న కళాశాల భవనాలకు శంకుస్థాపన చేయగా, 2010 అక్టోబర్ 29నుంచి ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్, కర్నూల్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బాలబాలికలకు ఇక్కడ ప్రవేశం ఉంటుంది. 2012–13 విద్యా సంవత్సరం 100శాతం ఫలితాలు సాధించడమే కాకుండా విద్యార్థులంతా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణలైన ఘన చరిత్ర ఈ కళాశాలకు ఉంది. ఆ తర్వాత ఉత్తీర్ణత శాతం క్రమేపీ తగ్గిపోయింది. ఇందులో ఇంటర్ ప్రవేశం కోసం 2016 ఏప్రిల్ 23తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు ఇక్కడి గురుకులంలో రెండేళ్లు చదివి 2018 మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు.
93 మంది పాస్...143 మంది ఫెయిల్...
2018 మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఈ కళాశాల నుంచి 120 మంది విద్యార్థులు హాజరు కాగా, కేవలం 40మంది మాత్రమే పాస్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 116 మందికి గాను 53 మంది పాస్ అయ్యారు. అంటే ప్రథమ సంవత్సర పరీ„ýక్షల్లో 33శాతం, ద్వితీయ ఏడాదిలో 46శాతం సగటున 39శాతం మంది పాస్ అయ్యారన్నమాట. మొత్తం 236 మందికి గాను 143మంది ఫెయిల్ కాగా, వీరిలో అత్యధికులు కెమీస్ట్రీ, బాటనీ సబ్జెక్టుల్లో తప్పారు. విచారకర విషయం ఏమిటంటే ఈ సబ్జెక్టుల్లో కూడా చాలా మందికి ఒక్కమార్కు, సున్నా మార్కులు వచ్చాయంటే ఇంకా సబ్జెక్టు బోధించిన అధ్యాపకులు ఎంతటి ఘనులో ఇట్టే అర్థం అవుతోందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్రమశిక్షణ కరువే...
అసలే కళాశాల స్థాయి అమ్మాయిలు...ఆపై టీనేజ్ అబ్బాయిలు...సమాంతర తరగతుల నిర్వహణ...పక్కపక్కనే బాలుర, బాలికల హాస్టల్ గదులు...దీనికి తోడు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కుర్రకారు అయ్యవార్ల భోదన...సరైనా కట్టుబాట్లు లేకపోతే పరిస్థితి చేయి దాటుతుందనడం బహిరంగ రహస్యం. ఈనేపధ్యంలో కళాశాలకు బలమైన పరిపాలనాదక్షుడు ఎంతో అవసరం. గత కొన్నేళ్లుగా ఈ కళాశాలకు అలాంటి వారు కరువయ్యారు. ఇక్కడ జరుగుతోన్న రహస్యాలను నాలుగు గోడల మ«ధ్య దాచేయాలని ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు బయటకు పొక్కుతూ వచ్చాయి. సమస్య మరింత తీవ్ర రూపం దాల్చకముందే ఇక్కడి నుంచి అటు బాలురనో, ఇటు బాలికలనో పంపివేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు 2017–18 విద్యా సంవత్సరంలో బాలురకు ఇక్కడ ప్రవేశం నిలిపేశారు. 2016–17 విద్యా సంవత్సరంలో చేరిన బాలురు సైతం ఈ ఏడాది బయటికి వెళ్లిపోనున్నారు. ఇక నుంచి అంతా బాలికలే, కాబట్టి అధ్యాపకులను సైతం మహిళలనే నియమిస్తే ఇక ఆ సమస్యకు పుల్‌స్టాప్ పడినట్లే.
రెగ్యులర్ అధ్యాపకులు కరువు...
ఇక్కడ ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారంతా కాంట్రాక్టు అధ్యాపకులే. వీరిలో కొందరు పాఠాలు చెప్పకుండా ఏడాది పొడవునా పిచ్చాపాటి మాటలకు ప్రాధాన్యత ఇస్తూ పొద్దుపుచ్చారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల మధ్య అసలు సయోధ్య లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఒకింత బాధ్యత తీసుకున్నా అధ్యాపకులు అతని మాట అసలు లెక్కచేసేవారు కాదని సమాచారం. పైగా కళాశాల పేరుకే ఇంగ్లీషు మీడియం అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల్లో కొందరికి ఇంగ్లీషుపై పట్టు లేదని తెలుస్తోంది. ఇక్కడ సొంత నోట్స్, కాలేజీ మెటీరియల్ అసలు ఉండదు. మార్కెట్‌లో దొరికే గైడ్‌లను ఫాలో కావాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో విద్యార్థులు, నాలుగైదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. రెండేళ్లపాటు రేయింబవళ్లు పాఠాలు బోధించి, లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసినా సాధించిన ఫలితాలు అధ్వానం ప్రస్తుత కలెక్టర్ చేవూరి హరికిరణ్ ప్రతిభ కళాశాల ఫలితాలు అధ్వానంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి, నిర్లక్ష్యానికి కారకులపై చర్యలు తీసుకుంటే తప్పా భవిష్యత్‌లో మార్పు రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment