- రాయనపాడు ఘటనలో నిందితుల ఫొటోలు గుర్తించిన బాధితులు
- మరో దోపిడీకి పాల్పడే అవకాశం
- పొరుగు జిల్లాల్లో అప్రమత్తం
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌లో సంచలనం కలిగించిన రాయనపాడులో దోపిడీ ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులుగా భావిస్తున్న వారి ఫొటోలను బాధిత కుటుంబం గుర్తించడంతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పం పారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని రాయనపాడు గ్రామానికి చెందిన కొలిపర్తి సురేష్‌బాబు ఇంట్లో దొంగలు పడి పెద్ద మొత్తంలో నగలు, నగదును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును కమిషనరేట్ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నేరం జరిగిన విధానాన్ని బట్టి దుండగులు మహారాష్ట్ర ముఠాలుగా గుర్తించారు.
రైల్వేట్రాక్‌ల సమీపంలో ఆవాసం
మహారాష్ట్ర ముఠాలు రైల్వే ట్రాక్‌లకు సమీపంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దోపిడీలు చేస్తుంటాయి. వీరిలో కంజరబట్, పార్థీ, ముంగా జాతి ముఠాలు ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లకు చేరువలో గుడారాలు వేసుకొని నివాసం ఉంటూ దోపిడీలకు పాల్పడటం వీరి నైజమని పోలీసు అధికారులు చెబుతున్నారు. పగటి వేళల్లో ప్లాస్టిక్ సామాన్లు, పూసలు, కుంకుమ విక్రయించే నెపంతో పరిసర ప్రాంతాల్లో మహిళలు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు.
గోచీకట్టు చీరకట్టుతో మహిళలు తిరుగుతుం టారని పోలీసులు పేర్కొంటున్నారు. రాత్రివేళల్లో మగవాళ్లు సామూహికంగా వెళ్లి దోపిడీలు చేస్తుంటారని చెబుతున్నారు. నేరం చేసే సమయంలో ప్రతిఘటన ఎదురైతే హత్యలు చేసేందుకు సైతం వీరు వెనుకాడరు. దోపిడీ చేసిన వెంటనే అక్కడి గుడారాలు ఎత్తేసి మరో చోటికి మకాం మార్చుతారు. మహారాష్ట్రకు చెందిన మూడు ముఠాలు నేరాలకు పాల్పడే తీరు ఒకే విధంగా ఉంటుంది.
పార్థీ ముఠాగా నిర్థారణ
రాయనపాడులో దోపిడీ ఘటనలో పార్థీ ముఠా పాల్గొందని పోలీసులు ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. మిగిలిన ముఠాల సభ్యులు మహారాష్ట్రలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పార్థీ ముఠాలకు చెందిన సభ్యులు మాత్రమే స్వస్థలాలు వదిలేసి బయ ట తిరుగుతున్నట్టు పోలీసు అధికారులకు సమాచారం ఉంది. ఈ ముఠా సభ్యులను 2010లో హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయగా, 2011లో బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచరిస్తున్న పార్థీ ముఠాల సభ్యులు.. రాయనపాడులో దోపిడీ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
శ్రీకాకుళం వరకు నిఘా
వివిధ ప్రాంతాల్లో గత కొద్ది రోజు లుగా జరిగిన దోపిడీ ఘటనలను పోలీ సులు గుర్తించి, దొంగలను పట్టుకునేందుకు శ్రీకాకుళం జిల్లా వరకు నిఘా ముమ్మరం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులను అప్రమత్తం చేశా రు. గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా బీబీ గూడెం, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వ రంగల్ జిల్లా రఘునాధపల్లిలో దోపిడీలు జరిగాయి. ఆ తర్వాత ఈ ముఠా రాయనపా డు వచ్చి దోపిడీకి పాల్పడి ఉంటుందని భా విస్తున్నారు.
శ్రీకాకుళం వైపు వెళ్లే క్రమంలో వీరు మరికొన్ని దోపిడీలు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా వీరు మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని, ఆ మార్గంలో నిఘా ఉంచామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వీరు మరో దోపిడీ చేయకుండా నిలువరించడంతో పాటు పట్టివేత లక్ష్యంగా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.