అన్వేషించండి.. ఆస్వాదించండి
- భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు రాఘవన్ పిలుపు
- అట్టహాసంగా ఏయూ స్నాతకోత్సవం
- 225 మందికి డాక్టరేట్ల ప్రదానం
ఏయూక్యాంపస్: ‘అన్వేషించండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఇతరులను సుసంపన్నం చేయండి.. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించి అందుకొనే ప్రయత్నం చేయండి’ అని భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు ఆచార్య ఎస్.వి రాఘవన్ అన్నారు. సోమవారం జరిగిన ఏయూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ జ్ఞానం, ఆరోగ్యంతో యువత సుసంపన్నం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీ భవిష్యత్తు, భారత దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. ఆధునిక భారతం నిర్మించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పీహెచ్‌డీ విభాగంలో 225 డాక్టరేట్లు అందించడం జరిగిందన్నారు. 13 మంది విశ్రాంతి ఆచార్యులు ఎమిరిటస్ ఆచార్యుల హోదా పొందారన్నారు. వర్సిటీ ద్వారా అందిస్తున్న నూతన కోర్సులు, విదేశీ వర్సిటీలతో జరుపుతున్న పరిశోధనలను వివరించారు. ఏయూలో ప్రస్తుతం 500 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
సందడిగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం సాయంత్రం 3.30 నుంచి 5.45 గంటల వరకు అంగరంగ వైభవంగా జరిగింది. సభావేదిక, సభామందిరం అతిథులు, ఆహ్వానితులతో కిక్కిరిసి పోయింది. వేదికపై వీసీ రాజు, ముఖ్యఅతిథి ఎస్.వి.రాఘవన్, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్‌లతో 120 మందికి పైగా అతిథులు ఆశీనులయ్యారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడంతో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షస్థానంలో స్నాతకోత్సవాన్ని నడిపించారు. ముందుగా ఆయన వార్షిక నివేదిక అందించారు. ముఖ్యఅతిథి భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్.వి.రాఘవన్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రదానం చేశారు. పట్టభద్రులచే ప్రమాణం చేయించారు. తరువాత డాక్టరేట్లు, మెడల్స్, బహుమతులు అందించారు.
రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రీ దేవి, సి.హెచ్ రత్నం, మాజీ ఉపకులపతులు ఆచార్య కె.రామకృష్ణారావు, వై.సి.సింహాద్రి, కె.వి రమణ, బీలా సత్యనారాయణ, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్లు పాల్గొన్నారు.
డాక్టరేట్ల ప్రదానం
పీహెచ్‌డీ విభాగంలో 225 డాక్టరేట్‌లు, 16 పతకాలు, 13 బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఆర్ట్స్‌లో 50, సైన్స్ 64, కామర్స్ మేనేజ్‌మెంట్ 24, ఇంజినీరింగ్ 41, కెమికల్ ఇంజినీరింగ్ 5, ఎడ్యుకేషన్ 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, న్యాయశాస్త్రం 3, ఫార్మసీ 30 మందికి డాక్టరేట్ పట్టాలు అందించారు. ఎంఫిల్ విభాగంలో ఆర్ట్స్‌లో 7, సైన్స్‌లో 12, కామర్స్, మేనేజ్‌మెంట్‌లో ఒకరు పట్టాలను అందుకున్నారు. వీటితో పాటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 426 మంది బహుమతులు, 155 మంది మెడల్స్ అందుకున్నారు.
ప్రముఖులకు డాక్టరేట్లు
స్నాతకోత్సవంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి (పొలిటికల్ సైన్స్), రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంత కుమార్(కామర్స్ మేనేజ్‌మెంట్), జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ బి.జయరామి రెడ్డి(సివిల్ ఇంజినీరింగ్) విభాగాలలో డాక్టరేట్లు అందుకున్నారు.