కేసీఆర్‌కు జ్ఞాపిక అందించేందుకు విఫలయత్నం
విజయవాడ బ్యూరో : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమరావతి జ్ఞాపికను అందించేందుకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఉంటున్న మహ్మద్ మోషిన్ సోమవారం విఫలయత్నం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను కలిసి జ్ఞాపికను అందించేందుకు మోషిన్ తన అనుచరులతో వచ్చారు. భద్రతా కారణాలతో పోలీసులు అతన్ని లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో వరంగల్ కోట ద్వారాన్ని గుర్తించి దానికి తెలుగు తోరణంగా ఎన్టీరామారావు నామకరణం చేశారని చెప్పారు. పురావస్తు ఆసక్తి ఉన్న వాడిగా తాను క్రీస్తుపూర్వం 600వ సంవత్సరం నాటి అమరావతి తోరణాన్ని గుర్తించి దాన్ని జ్ఞాపికగా తయారు చేయించినట్టు తెలిపారు.
అమరావతి తోరణంలో అశోకచక్రం కూడా ఉన్నట్టు తాను గుర్తించానన్నారు. వీటికి సంబంధించిన అవశేషాలు ప్రస్తుతం మన ప్రాంతంలో లేవని, మద్రాసు మ్యూజియంలో కొన్ని ఉన్నాయని చెప్పారు. అమరావతి తోరణానికి సంబంధించిన పురాతన కట్టడం, చరిత్రను గుర్తుచేసేలా ఈ జ్ఞాపికలను ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రులకు అందజేశానన్నారు. ఇప్పు డు అమరావతి తోరణం చిత్రానికి ఓవైపు తెలుగు తల్లి, మరోవైపు తెలంగాణ తల్లి ఫొటోలు చిత్రీకరించి కేసీఆర్‌కు బహూకరించేందుకు తెచ్చినట్టు చెప్పారు. కేసీఆర్ వెంట ఉన్న ఎంపీ బల్క సుమన్ అతన్ని గమనించి ఓ చానల్ ప్రతినిధి ద్వారా ఫోన్‌లో మాట్లాడారు. జ్ఞాపికతో హైదరాబాదుకు రావాలని సూచించటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.