‘అమరావతి’కి కేసీఆర్ | chandra babu naidu invites kcr to amaravathi inaugaration | Sakshi
Sakshi News home page

‘అమరావతి’కి కేసీఆర్

Published Mon, Oct 19 2015 3:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

‘అమరావతి’కి కేసీఆర్ - Sakshi

‘అమరావతి’కి కేసీఆర్

రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఏపీ సీఎం చంద్రబాబు
బాబుకు సాదరంగా స్వాగతం పలికిన కేసీఆర్, మంత్రులు
గంటపాటు ఇరువురు సీఎంల భేటీ
రాజధానిలో అసెంబ్లీకి భూమి, నిర్మాణ విధానంపై కేసీఆర్ వాకబు  

సాక్షి, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెప్పారు. ఈ నెల 22న జరిగే శంకుస్థాపనకు హాజరు కావాలని కోరుతూ చంద్రబాబు ఆదివారం సాయంత్రం స్వయంగా కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చి బాబుకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి కూడా బాబుకు స్వాగతం పలికారు.
 
 చంద్రబాబు వెంట తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించిన బాబు ఆయనకు తిరుపతి లడ్డూ ప్రసాదం అందించారు. కేసీఆర్ నివాసంలో చంద్రబాబు దాదాపు గంటసేపు గడిపారు. కాగా, ఇద్దరు సీఎంలు 25 నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. అంతకుముందు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఇరు పార్టీల నేతల ద్వారా అందిన సమాచారం మేరకు ఇద్దరు సీఎంల భేటీ వివరాలు ఇలా ఉన్నాయి.
 
తక్కువ మందినే ఆహ్వానిస్తున్నా..
ఆహ్వాన పత్రిక సింపుల్‌గా ఉందని సీఎం కేసీఆర్ అనడంతో.. ప్రధాని కార్యక్రమం కావడంతో ఎస్పీజీ భద్రత తదితర సమస్యలు ఉన్నాయని, తక్కువ మందినే ఆహ్వానించామని, అందుకే ఆహ్వాన పత్రికను సింపుల్‌గా ప్రింట్ చేయించామని బాబు బదులిచ్చారు. దసరా రోజు తనకూ యాదాద్రిలో పనుల శంకుస్థాపన, ఇతర కార్యక్రమాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెప్పిస్తున్న మట్టి, నీరు పైనా వీరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. తెలంగాణలో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెప్పిస్తున్నామని బాబు చెప్పగా.. కేసీఆర్ మరికొన్ని దేవాలయాల గురించి  వివరించారు. రాజధానిలో అసెంబ్లీకి ఎంత భూమి కేటాయించారు..? నిర్మాణ విధానంపై కేసీఆర్ వాకబు చేశారు. ఎంత విస్తీర్ణంలో కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నారని అడగ్గా.. వెయ్యి ఎకరాల్లో అని బాబు చెప్పారు. ఇందుకు స్థలం సరిపోదేమోనని కేసీఆర్ అన్నారు. కావాల్సినంత భూమి ఉందని, ఇబ్బందేం ఉండదని బాబు సమాధానం చెప్పారు.
 
నదుల అనుసంధానం, అభివృద్ధిపై..
నదుల అనుసంధానంపైనా ఇరువురు సీఎంలు చర్చించుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి నదుల అనుసంధానానికి ప్రయత్నాలు చేశారని, అయితే అప్పుడే నేపాల్ అభ్యంతరం చెప్పిందని బాబు అనగా.. అది కేంద్రం పరిధిలోనిది కేంద్రం చూసుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవల రాము (కేటీఆర్) ఉత్తరప్రదేశ్ వెళ్లాడని, అక్కడ డిస్కంలకు రాష్ట్రాలు రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్ల దాకా బాకీ పడ్డాయని, తెలంగాణ, ఏపీలో ఆ పరిస్థితులు లేవని కేసీఆర్ అన గా.. అప్పట్లో విద్యుత్ సంస్కరణలు చేపట్టడం వల్ల ఆ ఫలితాలను ఇరు రాష్ట్రాలు పొందుతున్నాయని చంద్రబాబు స్పందించారు.
 
జపాన్, దుబాయ్, సింగపూర్  దేశాల అభివృద్ధిపైనా చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముంబై- ఢిల్లీ కారిడార్, నెల్లూరు-చెన్నై, చెన్నై-వైజాగ్ కారిడార్లను చేపడుతున్నామని చంద్రబాబు చెప్పగా.. అమరావతి-హైదరాబాద్-ముంబై, బెంగళూరు కారిడార్ల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో మూతపడిన రేయాన్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఇద్దరు సీఎంలు కృషి చేయాలని ఎర్రబెల్లి, రమణ కోరగా.. ఇప్పటికే అందుకు ప్రయత్నాలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.
 
రోడ్డు మార్గంలో వస్తా..
కుటుంబ సమేతంగా అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించిన చంద్రబాబు... కార్యక్రమానికి ఎలా వస్తున్నారని వాకబు చేశారు. హెలికాప్టర్‌లోనా, లేక విమానంలో వస్తారా అని అడిగారు. అందుకు రోడ్డు మార్గంలోనే అమరావతికి చేరుకుంటానని, 21న సూర్యాపేటలో రాత్రి బస చేసి 22వ తేదీ ఉదయం వస్తానని చెప్పారు. మంత్రులకు కూడా ఆహ్వానాలు అందాయని అక్కడే ఉన్న మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌లను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ భేటీ తర్వాత బాబు నేరుగా గవర్నర్ న రసింహన్‌ను కలిసేందుక రాజ్‌భవన్‌కు వెళ్లగా, కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఏపీ, తెలంగాణ సీఎంలు కలుసుకోవడం ఇరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement