ఏలూరు (టూటౌన్)/పాలకొల్లు, న్యూస్‌లైన్ :
అతడో కూలీ. ఏలూరు మండలం వెంకటాపు రం పంచాయతీ పరిధిలోని బగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి రోజుల్లో పేకాట శిబిరానికి వెళ్లాడు. ఆసు.. రాణి.. కింగ్.. జోకర్ వంటి పేక ముక్కలు కలిసొచ్చాయి. ఐదారు ఆటల్లో రూ.1,500 గెలిచాడు. ఆ డబ్బుతో ఆనందంగా ఇంటికొచ్చాడు. రెండు రోజుల క్రితం ఏలూరు నగరంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్లి జీన్ ప్యాంటు కొన్నాడు. క్యాష్ కౌంటర్‌లో రూ.500 నోట్లు రెండు ఇచ్చాడు. అందులో ఒకటి నకిలీదని తేలింది. క్యాషియర్ నిలదీయడంతో సిగ్గుపడిపోయూడు. ఆ నోటు తీసుకుని అక్కడే చించివేశాడు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన మరో కూలీ కోడి పందేలకు వెళ్లాడు. డేగ పుంజుపై రూ.500, నెమలి పుంజుపై మరో రూ.500 పైపందెం కట్టాడు. మొత్తం నాలుగు పందేల్లో గెలవడంతో అతడికి రూ.2000 వచ్చింది. గెలిచిన ఆనందంతో మద్యం దుకాణానికి వెళ్లాడు. రూ.500 నోటు ఇచ్చి మద్యం సీసా అడిగాడు. దానిని పరిశీలించిన మద్యం అమ్మకందారు అతడివైపు ఎగాదిగా చూసి అది నకిలీ నోటని చెప్పాడు. అవాక్కవడం ఆ కూలీ వంతైంది. మారుమాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు. నాలుగైదు రోజులుగా జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నారుు.
భారీగా నకిలీ నోట్ల చలామణి
సంకాంత్రి సంబరాలు ముగిశాయి. కోడి పందాలు, జూదాలు ముమ్మరంగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. డబ్బు పోగొట్టున్న వారు విచారంలో మునిగిపోయూరు.. పందాలు గెలిచినోళ్లు హుషారెత్తిపోయూరు. కానీ.. వారి ఆనందం ఎన్నో రోజులు నిలబడలేదు. కోడిపందాలు, జూదాలు నిర్వహించిన వారు లెక్కలు తేల్చుకుంటున్న తరుణంలో బయటపడుతున్న నకిలీ నోట్లు వారిని బేజారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో దొంగనోట్లు మార్పిడి విచ్చలవిడిగా సాగిపోతోంది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా మార్పిడి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా తమపని తాము చేసుకుపోతున్నారు. అడపాదడపా వీరిని పోలీసు అరెస్టులు చేయడం, కోర్టుకు పంపడం చేస్తున్నా బెయిల్ విడుదలైన అనేకమంది అదేపనిలో నిమగ్నమవుతున్నారు. ఈసారి సంక్రాంతి కోడి పందాలను నకిలీ నోట్ల మార్పిడికి లక్ష్యంగా ఎంచుకున్నారు. జూదగాళ్ల అవతారం ఎత్తి పెద్దమొత్తంలో పందాలు కాసి నకిలీ నోట్లను చలామణిలో పెట్టారు.
పాలకొల్లు మండలం పూలపల్లిలో రెండుచోట్లు భారీ పందాలు నిర్వహించగా యలమంచిలి, పోడూరు మండలాల్లో మోస్తరు పందాలు జరిగాయి. ఈ శిబిరాల్లోకి చొరబడిన వ్యక్తులు పెద్దమొత్తంలో పందాలు కాశారు. ఒడ్డిన సొమ్ములో కొన్ని నకిలీ, మరికొన్ని అసలు నోట్లు పెట్టి ఇవ్వగా, జూదాల నిర్వహకులు హడావిడిలో వాటిని తీసుకున్నారు. పందాల తంతు ముగియడంతో ప్రస్తుతం సొమ్ము పంపకాలు, లాభనష్టాల బేరీజు వేసుకుంటున్న తరుణంలో నకిలీ నోట్లు బయట పడుతున్నాయి. వాటిని మార్చే సందర్భంలో కొందరు దొరికిపోతున్నారు. అక్కడిక్కడే వాటిని చింపేసి బయటపడుతున్నారు. మరికొందరైతే వాటిని దర్జాగా మార్చుకుని బయటపడుతున్నారు. వస్త్ర దుకాణాలు, మద్యం షాపులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల వద్ద దొంగనోట్లు ఎక్కువగా బయటపడుతున్నాయి.
పందెం నోట్లు.. గెలిచినోళ్లకు పాట్లు
Published Tue, Jan 21 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement