ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్‌చల్‌ | fake revenue officer hulcul in ap capital amaravathi | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్‌చల్‌

Published Fri, Jun 30 2017 11:11 AM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM

ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్‌చల్‌ - Sakshi

ఏపీ రాజధానిలో నకిలీ అధికారి హల్‌చల్‌

హైదరాబాద్‌: ఏపీ రాజ‌ధాని అమరావతిలో న‌కిలీ అధికారి హ‌ల్‌చల్‌ చేశాడు. రెవెన్యూ అధికారినంటూ రాజధాని రైతులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు నకిలీ అధికారి అని తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వివరాలు.. తుళ్ళూరు మండ‌లం వెంక‌ట‌పాలెం చెక్ పోస్టు వ‌ద్ద ఓ వ్య‌క్తి ' నా పేరు చ‌ల్ల‌ప‌ల్లి ప్ర‌సాద్ రావు.. నేను రెవెన్యూ డిపార్టుమెంట్ లో డిప్యూటి సెక్ర‌ట‌రీగా ప‌ని చేస్తున్నాను.. మీరు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన స‌ర్వే నంబ‌ర్ 171 లో ఉన్న రెండెక‌రాల 75 సెంట్ల పొలానికి హ‌ద్దులు లేవు.. పైగా దానిలో 15 సెంట్లు మిగులు భూమి ఉంది.. నేను అడిగినంత డ‌బ్బు ఇస్తే ఈ విష‌యాన్ని సీఆర్డీఏ కు చెప్ప‌ను. లేదంటే మిగుల భూమి గురించి సీఆర్డీఏ అధికారులకు చెప్పి ఈ భూమిని నీకు లేకుండా చేస్తా' అని అల్లూరి రామ‌కృష్ణ అనే రైతును న‌కిలీ అధికారి బెదిరించాడు.
 
దీంతో బెంబేలెత్తిన రైతు రామ‌కృష్ణ ఊరిలోని పెద్ద మ‌నుషుల్ని ఆశ్ర‌యించాడు. ఆ న‌కిలీ అధికారి తో పెద్ద మ‌నుషులు పంచాయితీ పెట్టినా లాభం లేక‌పోయింది. దీంతో ఆగ్ర‌హించిన వారు అసలు రెవెన్యూ డిపార్డుమెంట్ లో నువ్వు ఏమి చేస్తావు.. అంటూ డిపార్డుమెంట్ లో ప‌ని చేస్తున్న కొంత మంది అధికారులు పేర్లు చెప్పి.. వాళ్లు తెలుసా అంటూ న‌కిలీ అధికారిని గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. దీంతో తను ఇప్పుడు వేరే డిపార్టుమెంట్‌కు మారినట్టు బుకాయించాడు. అంతేకాకుండా  తన అల్లుడు గొల్ల‌పూడిలో త‌హ‌సీల్ధార్ గా ప‌నిచేస్తున్నాడని తెలిపాడు. తనకు చాలా రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉందని.. మ‌ర్యాద‌గా అడిగిన డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని చెల‌రేగిపోయాడు.
 
ఇదే స‌మ‌యంలో అక్క‌డికి చేరుకున్న మీడియాను చూసి న‌కిలీ అధికారి పారిపోయాడు. రైతులు అత‌న్ని ప‌ట్టుకోవడానికి వెంట‌ప‌డినా ఫ‌లితం లేకుండా పోయింది. అయితే ప‌దిహేను రోజుల క్రితం ఇదే వ్య‌క్తి సీఆర్డీఏ కార్యాల‌యంలో తాను రెవెన్యూ అధికారిని అని భూములు వివ‌రాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యపడలేదు. ఈ విష‌యాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు. దీంతో సీఆర్డీఏ అధికారుల‌కు, రైతులను బెదిరిస్తన్న న‌కిలీ అధికారికి సంబంధాలు ఉన్నాయ‌ని రాజ‌ధానిలో ప్ర‌చారం జ‌రుగుతోంది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement