తిరుపతిలో మళ్లీ బోగస్‌ ఓటర్లు! | Fake Voters In Tirupati Chittoor | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మళ్లీ బోగస్‌ ఓటర్లు!

Published Wed, Aug 22 2018 12:05 PM | Last Updated on Wed, Aug 22 2018 12:05 PM

Fake Voters In Tirupati Chittoor - Sakshi

తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్‌కు ఆధారాలు అందజేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

తిరుపతి సెంట్రల్‌ : తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో పాలకపక్ష జోక్యం ఎక్కువైందా అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు. అధికారమే పరమావధిగా పాలకపక్షం బరి తెగిస్తోందని ఆరోపిస్తున్నాయి. అధికారులను అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. పైగా తమ సానుకూల ఓటర్లను పాలకపక్ష ప్రతినిధులు పనిగట్టుకుని తొలగిస్తున్నారని చెబుతున్నాయి. గత అనుభవాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నాయి. తాజా గా ప్రతిపక్షాలు నిర్వహించిన సర్వేలో 20 వేల ఓట్లపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

గతంలో భారీగా బోగస్‌ ఓటర్లు
గత ఎన్నికల సమయంలో 2.76 లక్షల ఓటర్లతో యంత్రాంగం జాబితాను రూపొందిం చింది. పోలింగ్‌ విషయానికి వచ్చే సరికి 50–55 శాతం దాటని పరిస్థితి. ఇది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయేది. బోగస్‌ ఓటర్లతో జాబితా తయా రు కావడమే ఇందుకు ప్రధాన కారణమని ఎట్టకేలకు ఎన్నికల సంఘం గుర్తించింది. తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో బోగస్‌ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు నాటి యంత్రాంగం పసిగట్టింది. ఫిర్యాదుల ఆధారంగా స్పందించింది. 2015–16లో ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్‌ రోల్‌ కింద ఇంటింటికీ వెళ్లి పరిశీలించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో 2.76 లక్షల ఓట్లలో 70 వేల పై చిలుకు ఓట్లు బోగస్‌వేనని తేలిపోయింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు కావడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో బోగస్‌ ఓట్లను యంత్రాంగం జాబితా నుంచి తొలగించింది. ఆ తర్వాత ఓటర్‌ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే అంశాన్ని యంత్రాంగం పరిశీలించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అది అమల్లోకి రాలేదు.

మళ్లీ 20 వేలకుపైగా ఓట్లపై అభ్యంతరాలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ బోగస్‌ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు సమాచారం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 256 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 20 వేలకు పైగా ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరణించిన 1,326 మందికి ఓటు హక్కు ఉండడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత జాబితాలోని 9, 491 మంది ఓటర్ల అడ్రస్‌లను గుర్తించడం యం త్రాంగానికీ సాధ్యపడడం లేదు. గతంలో సదరు ఓటర్లు తప్పుడు అడ్రస్‌లను సమర్పించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో 1,463 ఓటర్ల పేర్లు రెండేసి సార్లు లేదంటే అంత కు మించి జాబితాలో నమోదు కావడం గమనా ర్హం. అదనంగా మరో 8, 504 మంది ఓటర్లు ఇత ర అడ్రస్‌లకు మారినట్టు చెబుతున్నా ప్రస్తుతం వారంతా నియోజకవర్గ పరిధిలోనే నివాసముంటన్నదీ లేనిదీ గుర్తించాల్సి ఉంది. ఒకే అడ్రస్‌పై పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదు కావడం, ఖాళీ స్థలా లనే నివాస ప్రాంతాలుగా చూపి ఓటర్లుగా చేర డం వంటి పరిస్థితులు తలెత్తాయి.

జాబితా సవరించాలనివైఎస్సార్‌ సీపీ డిమాండ్‌
బోగస్‌ ఓట్లను తక్షణమే తొలగించి జాబితా ను సవరించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది. అవసరమైతే కేంద్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించింది. న్యాయ పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని హెచ్చరిస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనపై తిరుపతి అర్బన్‌ మండల తహసీల్దార్‌ చంద్రమోహన్‌ స్పందిస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందేలా చర్యలు చేపడుతామని చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే సార్వత్రిక ఎన్నికల నాటికి అభ్యంతరాల ఆధారంగా ఓటర్ల జాబితాను సవరిస్తామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement