కోటగుమ్మం: ఎస్సీ, బీసీలను కేవలం కార్పొరేషన్ చైర్మన్ పదవులకే పరిమితం చేస్తూ రాజ్యాధికార భోగాలను అగ్రవర్ణాలు అనుభవిస్తున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మంగళవారం ఆయన మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు జెఆర్ పుష్పరాజ్‌ను ఎంపిక చేస్తామని.. ఇప్పుడు ఆయన పేరును పక్కన పెట్టడం దారుణమన్నారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి రాష్ట్రం పరువు తీసిన సుజనాచౌదరిని మరోసారి రాజ్యసభకు పంపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
వేలం పాటలో కొనుగోలు చేసినట్టు మరో రాజ్యసభ స్థానాన్ని టీజీ వెంకటేష్ దక్కించుకున్నారని విమర్శించారు. మార్కెటింగ్ కమిటీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ విధానం పాటించిందని, ఆ విధానాన్నిఏపీలో ఎందుకు అమలు చేయడం లేదని హర్షకుమార్ ప్రశ్నించారు. ఎస్సీ, బీసీలను పావులుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఏవిధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపితే.. విశాఖ రైల్వే జోన్ విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభును ఓడించాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబునాయుడు.. కేసీఆర్ వద్ద ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని నిర్ణయించినా.. సచివాలయాన్ని వారికి పూర్తిగా అప్పగించేశారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయం ముగిసిపోయిందని, దానిపై ఉద్యమం చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని తెరపైకి తెచ్చి మాదిగలను రెచ్చగొట్టి ఉద్యమించడం సరికాదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.