విజయవాడ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ భేటీ అయ్యారు. వాస్తవానికి టీడీపీ బలం రెండు రాజ్యసభ సీట్లు గెల్చుకోవడానికే సరిపోతుంది. కానీ..నాలుగు సీట్లకు అభ్యర్థులను నిలుపుతామంటూ టీడీపీ నేతలు ఎల్లో మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిపించుకునే బలం లేకపోయినా టీడీపీ మాత్రం పోటీకి సిద్ధం అవుతోంది. ఓటుకు కోట్లు తరహాలో వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడింది. సాక్షాత్తూ సీఎం అధికార నివాసంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దిగజారని విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ బాషా, జయరాములు, ఆదినారాయణరెడ్డి, సునీల్ కుమార్, గొట్టిపాటి రవికుమార్, డేవిడ్ రాజు, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, కిడారి సర్వేశ్వరరావు, సుజయకృష్ణ రంగారావు, కలమట వెంకటరమణ ...తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.