విజయవాడ: రాజ్యసభకు నాలుగవ అభ్యర్థి విషయంలో చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఆయన మరోసారి సమావేశం కానున్నారు. అయితే ఈసారి సీన్ విజయవాడ నుంచి హైదరాబాద్కు మారనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సోమవారం భేటీ అయిన ఆయన రేపు మలివిడత సమావేశం అవుతారు.
కాగా అంతకు ముందు సమావేశంలో.... ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు అడిగినట్లు సమాచారం. ఈలోగా ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఫోన్లు రావడంతో మళ్లీ మాట్లాడతానంటూ ఆయన లోనికి వెళ్లిపోయారు. దీంతో నాలుగో అభ్యర్థి విషయంలోనూ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు (బీజేపీ) పేర్లను చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేశామని, అనంతరం సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారికే తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.