పులిగడ్డ వద్ద ముంపునకు గురైన అరటితోట(ఫైల్)
సాక్షి, మచిలీపట్నం: ఆపత్కాలంలో అన్నదాతను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. కళ్లెదుటే కష్టం అంతా వరదార్పణం కావడంతో పుట్టెడు నష్టాల్లో ఉన్న జిల్లా రైతాంగానికి కొండంత భరోసా కల్పించింది. సాధారణంగా విపత్తుల సమయంలో ఇచ్చే నష్ట పరిహారానికి మించి 15 శాతం అదనంగా రైతులకు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్ర పరిశీలన చేసిన అధికారులు ఉద్యాన వన పంటల నష్టంపై ప్రభుత్వానికి తుది నివేదికను అందించారు. ఇక వ్యవసాయ పంటలకు సంబంధించి నేడు తుది నివేదిక సమర్పించనున్నారు.
పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 10 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన వరదలు ఏకంగా వారం రోజుల పాటు కొనసాగాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టంపై అధికారులు తుది నివేదికను తయారు చేశారు.
వారం రోజుల పాటు క్షేత్ర స్థాయి పరిశీలన
వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాయి. 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతు వారీగా పంటలను సర్వే చేశాయి. 33 శాతానికి మించి వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు అంచనాలను రూపొం దించారు. ఆ విధంగా జిల్లాలో 1,134 మంది రైతులకు చెందిన 818 హెక్టార్లలో రూ.1.19 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు, 7,051 మంది రైతులకు చెందిన 4021.872 హెక్టార్లలో రూ.7.60కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా లెక్క తేల్చారు. 14 మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు.
ఉద్యాన పంటలకే అపార నష్టం
వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలకే అపార నష్టం వాటిల్లింది. తోట్లవల్లూరు మండలంలో ఏకంగా 2,382.86 హెక్టార్లు, మోపిదేవి మండలంలో 338.93 హెక్టార్లు, చల్లపల్లి మండలంలో 296.70హెక్టార్లు, అవనిగడ్డ మండలంలో 287.38 హెక్టార్లు, ఇబ్రహీం పట్నంలో 204.16 హెక్టార్లు, కంచికచర్ల మండలంలో 120.95 హెక్టార్లు, చందర్లపాడు మండలంలో 104.05 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన వన పంటల నష్టానికి సంబంధించి తుది నివేదికలను బుధవారం రాత్రికి ప్రభుత్వానికి పంపించారు.
వ్యవసాయ పంటలు ఇలా..
వ్యవసాయ పంటల విషయానికి వచ్చేసరికి ప్రాథమిక అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ 33 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన పంటలనే పరిగణనలోకి తీసుకోవడంతో నష్ట తీవ్రత తగ్గింది. అలాగే కంచికచర్ల, చందర్లపాడు, తోట్లవల్లూరుల్లో పరిశీలన జరగాల్సి ఉంది. ఇదీ కూడా పూర్తికాగానే.. ప్రభుత్వానికి తుది నివేదిక అందించనుట్లు అధికారులు పేర్కొన్నారు.
స్కేల్ ఆఫ్ రిలీఫ్ కంటే 15 శాతం అదనంగా పరిహారం
గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.15 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద వరి, వేరుశనగ, పత్తి, చెరకు హెక్టార్‌కు రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.12,500, అపరాలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్, గోధుములకు రూ.10వేలు, పొగాకుకు రూ.10వేలు, జొన్న, సజ్జలు, రాగులు, సజ్జలు, నువ్వులుకు రూ.6,800, కొర్రా, సామా, వరిగ, మస్టర్డ్ పంటలకు రూ.5వేలు, పొలంలో ఇసుక మేటు వేస్తే రూ.12,200, పంట భూమి కోతకు గురైతే రూ.37,500 చొప్పున చెల్లిస్తారు.
ఇక కేంద్రమైతే వర్షాధారమైన భూముల్లో పంటలకు హెక్టార్‌కు రూ.6,800లు, సాగునీటి వనరుల కింద సాగయ్యే పంటలకు రూ.13,500లు, ఇసుక మేట వేస్తే రూ.12,200లు, కోతకు గురైతే రూ.37,500లు చెల్లిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద చెల్లిస్తున్న మొత్తానికి 15 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంతో వరద బాధిత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఉదారంగా ఆదుకున్న సందర్భం లేదని చెబుతున్నారు.
ఇదే తొలి అడుగు..
వరదలు, తుఫాన్‌లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు రూ.3వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. గడిచిన రెండు నెలలుగా కృష్ణా, గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావడం నిజంగా ముదవాహమని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నష్టం వివరాలు ఇలా
వ్యవసాయ పంటలు
పంట రకం | జరిగిన నష్టం(హెక్టార్లలో) |
పత్తి | 493 |
వరి | 119 |
చెరుకు | 127.3 |
మొక్కజొన్న | 53.78 |
కందులు,పెసలు, మినుములు | 25.73 |
ఉద్యానవన పంటలు
పంట రకం | జరిగిన నష్టం(హెక్టార్లలో) |
అరటి | 843.682 |
చింత | 1665.906 |
కూరగాయలు | 584.312 |
కంద | 678.514 |
మామిడి | 2.4 |
బొప్పాయ | 89.6 |
నిమ్మ | 0.4 |
జామ | 14.59 |
తమలపాకు | 43.22 |
పూలతోటలు | 9.2 |
మిరప | 89.648 |
బేర్ యాపిల్ | 0.4 |
నష్టం ఇలా..
ఉద్యాన పంటలు | 4,021.872 హెక్టార్లు |
వ్యవసాయ పంటలు | 818 హెక్టార్లు (ఇంకా పెరుగుతుంది) |
నష్టపోయిన మొత్తం రైతులు | 8,185 |
Comments
Please login to add a commentAdd a comment