సాక్షి, అమరావతి/తెనాలి రూరల్: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాజధానిలో తనపై దాడి అనంతరం కొందరు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ టీవీ జర్నలిస్ట్ నల్లమోతు దీప్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం దీప్తి, మరో మహిళా జర్నలిస్టు హసీనా, పలువురు మీడియా ప్రతినిధులు డీజీపీ సవాంగ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచి్చందన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ ఆ నిరసనలు హింసకు దారితీసేలా ఉండకూడదని అన్నారు. రాజధాని రైతుల ఆందోళనను సున్నితంగానే చూశామన్నారు. అయితే ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కల్గించేలా వ్యవహరించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఇప్పటి వరకు రాజధానిలో ఆందోళనలపై 12 కేసులు నమోదు చేశామన్నారు. జర్నలిస్టులపై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు, రక్షణ అంశాలకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి రాజధాని హైపవర్ కమిటీలో తన పేరు పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. డీజీపీ ఆఫీసు ఎక్కడ ఉండాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు అందించే సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బలగాలను సమన్వయం చేయడానికి డీజీపీ కార్యాలయం దోహదం చేస్తుందన్నారు. పాలనాపరమైన పోలీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
నిందితులకు జనవరి 10 వరకు రిమాండ్
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జర్నలిస్టులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, మల్కాపురం, వెలగపూడి, నెక్కల్లు గ్రామాలకు చెందిన శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకటస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే నిందితులను విడిచిపెట్టాలని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద హడావుడి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్టేషన్‌కు వచ్చి నిందితులను విడిచిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం రాత్రి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌వీవీఎన్ లక్షి్మ.. నిందితులకు జనవరి 10 వరకూ రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment