రైతు కష్టం... బుగ్గిపాలు
- మల్లవోలులో ఘోర అగ్నిప్రమాదం
- 8 ఎకరాల వరికుప్ప దగ్ధం
- వరి నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ కూడా మంటలపాలు
- రూ.11 లక్షల ఆస్తి నష్టం
- కన్నీటిపర్యంతమైన రైతు కుటుంబం
గూడూరు, న్యూస్‌లైన్ : మరికొద్ది గంటల్లో నూర్పిడి చేసిన లక్షలాది రూపాయల ధాన్యం ఇంటికి చేరి సిరులు కురిపిస్తుందనే ఆనందంలో ఉన్న ఆ రైతు కుటుంబానికి అగ్నిప్రమాదం రూపంలో తీరని కష్టం ఎదురైంది. నూర్పిడి చేస్తున్న పంట బుగ్గిపాలైంది. ఈ ఘటనలో 11 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని మల్లవోలులో బాదర్ల వెంకటేశ్వరరావు అనే రైతు ఎనిమిది ఎకరాల్లో సొంత భూమి, కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
వర్షాలకు ముందే కోత పనులు పూర్తి చేసి నూర్పిడి కోసం కూలీలు అందుబాటులో లేక కుప్ప వేశాడు. బుధవారం వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు కూలీల భారం తగ్గించుకునేందుకు కుప్పనూర్పిడి యంత్రం ద్వారా నూర్పిడి పనులు ప్రారంభించాడు. సుమారు నాలుగు ఎకరాల వరకు నూర్పిడి అయ్యాక నిప్పు రవ్వలు ఎగిరి గడ్డిపై పడటంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నిప్పు రాజుకుంది.
అసలే భగభగ మండే ఎండ కాయటంతో పాటు గాలులు తోడవటంతో ఎనిమిది ఎకరాల వరి కుప్పను మంటలు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో పాటు కుప్పనూర్పిడి కోసం తీసుకువచ్చిన నూర్పిడి యంత్రం, ట్రాక్టర్‌కు కూడా మంటలు వ్యాపించటంతో తీరని నష్టం జరిగింది.
పరుగులు తీసిన కూలీలు...
మంటల వేడికి తాళలేక కూలీలు, రైతు నూర్పిడి యంత్రం యజమాని పరుగులు తీశారు. పరిసరాల్లో నీరు అందుబాటులో లేకపోవటంతో మంటలను అదుపు చేసే అవకాశం లేక అలాగే చూస్తుండిపోయారు. చుట్టుపక్కల రైతులు మచిలీపట్నం అగ్నిమాపక శకటానికి సమాచారం అందించటంతో వారు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
వరిగడ్డి కావటంతో వారికి కూడా మంటలను అదుపు చేయటం ఒక పట్టాన సాధ్యం కాలేదు. ఊహించని విధంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల రైతులు హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన పరిసరాల్లోనే పదుల సంఖ్యలో వరికుప్పలు, గడ్డివాములు, ధాన్యపు రాశులు ఉన్నాయి. అగ్నికీలలు ఎక్కడ తమ కుప్పలపై పడతాయోనని పరిసర రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తీరని నష్టం...
ఆరుగాలం కష్టించి పండించిన పంట కొద్ది గంటల్లో చేతికందే దశలో అగ్నిప్రమాదం కారణంగా సర్వనాశనం కావటంతో రైతు బాదర్ల వెంకటేశ్వరరావు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎకరానికి రూ.22 వేల వరకు పెట్టుబడి అయ్యిందని, లక్షన్నరకు పైగా అప్పు చేసి సాగు చేశానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎకరానికి 40 బస్తాలకు పైగా పంట పండిందని, ఈ లెక్కన సుమారు 350 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతి కావటంతో రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి తోడు కిరాయి కోసం వచ్చిన ట్రాక్టర్ యజమాని సైతం తీవ్రంగా నష్టపోయాడు. నెలకుర్రు గ్రామానికి చెందిన రవీంద్రనాధ్ కుప్పనూర్పిడి యంత్రాలను తిప్పుతూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో మల్లవోలులో గత కొంతకాలంగా నూర్పిడి యంత్రం పనులు చేస్తున్నాడు. ఈ నూర్పిడి యంత్రం ట్రాక్టర్ ఇంజన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ నూర్పిడి సమయంలో ట్రాక్టర్ రేడియటర్ పుల్లీ నుంచి నిప్పు రవ్వలు ఎగసి గడ్డిపై పడి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
ఈ ట్రాక్టర్, కుప్పనూర్పిడి యంత్రం కూడా దగ్ధం కావటంతో యంత్రం యజమానికి రూ.8 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. పంట యజమాని, ట్రాక్టర్ యజమానులకు ఈ ప్రమాదం రూ.11 లక్షల మేర నష్టం మిగిల్చింది. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ బి.శ్రీదేవి, ఆర్‌ఐ నరసింహారావు, వీఆర్వోలు రాజమోహన్, బాలభాస్కర్, సర్పంచ్ పర్ణం అరుణశ్రీ, పీఏసీఎస్ అధ్యక్షుడు చీడేపూడి ఏడుకొండలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.