వాకాడు, న్యూస్‌లైన్ : సాగునీటి కోసం మండలంలోని కోడివాక ఆయకట్టు రైతులు పలువురు ఆదివారం సాయంత్రం నుంచి స్థానిక స్వర్ణముఖి బ్యారేజీ అతిథి గృహం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ స్వర్ణముఖి బ్యారేజీకి తెలుగుగంగ నీరు వచ్చినప్పటి నుంచి కొందరు అధికార పార్టీ నేతలు అధికారులను వారి గుప్పెట్లో పెట్టుకుని వారికి అనుకూలమైన గ్రామాల చెరువులకు మాత్రమే సాగునీటిని విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం నుంచి కల్లూరు చెరువుకి నీరు విడుదల చేసి కోడివాక చెరువుకు సరఫరా చేస్తామని గూడూరు ఆర్డీఓ చెప్పారని, అయితే ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో మంగళవారం నుంచి విడుదల చేస్తామని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరు చెరువుకు దిగువన ఉన్న కోడివాక, దుర్గవరం, ముట్టెంబాక, తిరుమూరు, దుగరాజపట్నం, చీమలపాడు గ్రామాల్లో పంటలు ప్రస్తుతం పొట్ట, వెన్నుదశలో ఉన్నాయన్నారు.
సుమారు నాలుగు వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందు ఆర్డీఓ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఈఈ అప్పరావు, డీఈ రాజగోపాల్ కృష్ణమాచార్య ఆయకట్టు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కొద్ది సేపు చర్చించారు. బ్యారేజీలో ఉన్న సాగునీటిని దృష్టిలో ఉంచుకుని రైతులందరికీ విడతల వారీగా నీరు అందిస్తామని, మంగళవారం నుంచి 7 రోజులు పాటు కల్లూరు చెరువుకు విడుదల చేస్తామని ఈఈ అప్పరావు చెప్పారు. మూడు రోజులు ఆగితే పంటలు పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా వదిలి వేయాల్సి వస్తుందని రైతులు మండి పడ్డారు.
ఆధికారుల హామీతో దీక్ష విరమణ
రైతులు ఆమరణ దీక్షకు పూనుకోవడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు దీక్ష విరమించారు.
సాగునీటి కోసం రైతుల ఆమరణ దీక్ష
Published Mon, Feb 3 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement