ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై రైతులు మౌనం వీడి ఉద్యమిస్తేనే మంచిరోజులని ఉద్యోగ జేఏసీ నేతలు సూచించారు. ఒక వైపు రాష్ట్ర విభజనకు రోజురోజుకూ కుట్రలు పెరిగిపోతున్నాయనీ, ఈ దశలో అయినా రైతులు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగ జేఏసీ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించింది. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిరసన ర్యాలీలు, మానవహారాలు, దీక్షలు కొనసాగాయి.
సమైక్య ఉద్యమం ఊపందుకుంటున్నా ఢిల్లీ నేతలు మాత్రం తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణాజలాలు జిల్లాకు చేరుకునే అవకాశం గగనమేనన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛయిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తై నీరు ఉండదన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టులు చివరకు నీరు లేక వె లవెలబోతే తద్వారా రైతు బతుకు దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు వస్తుంది...తమ బతుకులు చిగురిస్తాయనే ఆశతో ఉన్న వారితో పాటు, కృష్ణా డెల్టా కెనాల్ కింద ఉన్న ఆయకట్టు భూములకు సైతం నీరందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా భూములు సాగర్ ఆయకట్టు చివరివి కావడంతో వాటికి కూడా నీరందదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రైతులు కూలీలుగా మారుతారని ఉద్యోగ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
వేటపాలెం, మార్కాపురం మండలం నికరంపల్లి, కందుకూరు మండలం పలుకూరు గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించారు. సమైక్యాంధ్ర సాధన కోసం గిద్దలూరులో ఉద్యోగ జేఏసీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆరోగ్య కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. అద్దంకిలో ఎన్‌జీఓ నేతలు మేదరమెట్ల- నార్కెట్‌పల్లి జాతీయరహదారిపై మానవహారం నిర్వహించారు. బంగ్లా రోడ్డులో ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు చేపట్టారు. ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు బషీర్, కేఎల్ నరశింహారావు తదితరులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను పరిగణనలోనికి తీసుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఒక వైపు ప్రజాభిప్రాయాలతో శ్రీకృష్ణ కమిటీ నివేదికను సిద్ధం చేసి అందించినా... దానిని కాదని, కేవలం రాజకీయ పార్టీల సలహాలతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం ప్రజాస్వామ్యబద్ధం కాదని పేర్కొన్నారు.
కనిగిరిలో ఉద్యోగ జేఏసీ తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. దీక్షలో పాతికమంది మహిళలు కూర్చున్నారు. సమైక్యాంధ్ర సాధన కోరుతూ చీరాలలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఐదుగురు, వేటపాలెంలో మరో ఐదుగురు రిలే దీక్షలు చేపట్టారు. పర్చూరులో న్యాయవాదుల దీక్ష 72వ రోజుకు, ఉద్యోగ జేఏసీ దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి.
మౌనం వీడితేనే మంచిరోజులు
Published Wed, Oct 16 2013 7:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement