ఎన్‌ఎస్‌పీ అధికారుల తీరుపై రైతుల ఆందోళన | farmers protests on nsp officers behave | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌పీ అధికారుల తీరుపై రైతుల ఆందోళన

Published Mon, Dec 23 2013 2:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers protests on nsp officers behave

కురిచేడు, న్యూస్‌లైన్: సాగర్ కాలువ పరిధిలోని మేజర్లకు నీటి సరఫరాలో అధికారులు అవలంబిస్తున్న వైఖరి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన కాలువ పరిధిలోని 124వ మైలులో ఉన్న ఐనవోలు మేజరుకు శనివారం పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయడంతో నీరు కాలువ పట్టక పొంగి పొర్లుతోంది. మేజరు హెడ్‌కు కూతవేటు దూరంలో ఉన్న యూటీ పొంగి వాగులోకి నీళ్లు పొర్లిపోతున్నాయి. మేజరు ఆసాంతం పంట పొలాల గట్లపైకి ప్రవహిస్తున్నాయి. మేజరు పరిధిలోని 2వ కిలోమీటరు వద్ద రెండేళ్ల క్రితం గండిపడిన చోట నీళ్లు కట్ట పొర్లిపోతున్నాయి.

ఈ నీటి సరఫరా మరో 24 గంటలు ఇలాగే కొనసాగితే కట్టకు గండిపడే అవకాశం ఉంది. కాలువపై పర్యవేక్షించాల్సిన అధికారులు గుంటూరు జిల్లా వినుకొండ సబ్‌డివిజన్ విడిచి వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా కాలువపై ఉండాల్సిన లస్కర్లను సైతం వారి సొంత పనులకు వినియోగించుకుంటుండటంతో మేజరుపై పర్యవేక్షణ కొరవడింది. ఎక్కడ ఎంత నీరు వృథా అవుతోందీ పట్టించుకునే నాథుడే లేడు. ఈ తరుణంలో మేజరుకు గండిపడితే దాని పరిధిలోని ఆయకట్టు సుమారు 1500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దర్శి బ్రాంచ్ కాలువ పరిధిలోని మేజర్లకు నీరు అరకొరగా విడుదల చేయడంతో చివరి భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు.

 మేజరు ప్రారంభంలోని రైతులు డ్రాపులకు అడ్డుకట్టలు వేసి తూములు మళ్లించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల మధ్య గొడవలు ప్రారంభమై నీటి యుద్ధాలు చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. అధికారులు మేజర్ల పరిస్థితి గమనించి చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోకుండా కార్యాలయానికే పరిమితమవుతున్నారు. పడమర వీరాయపాలెం మేజరు పరిధిలో రైతులు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వారు తూములు ఏర్పాటు చేసుకున్నా..పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పటికైనా ఎన్‌ఎస్‌పీ అధికారులు స్పందించి మేజర్లపై నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement