సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి | Farmers takes on capital city Sub-committee | Sakshi
Sakshi News home page

సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి

Published Fri, Dec 5 2014 3:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి - Sakshi

సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి

సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేం దుకు వ్యతిరేకిస్తున్న 13 గ్రామాల రైతులతో కేబినెట్ సబ్‌కమిటీ నిర్వహించిన సమావేశం వాడీవేడిగా సాగింది. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా భూములిచ్చేది లేదని రైతులు కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో సీఎంతో సమావేశానికి రావాలంటూ సబ్ కమిటీ సభ్యులు కోరగా... హైదరాబాద్ వచ్చేది లేదనీ, విజయవాడలోనో గుంటూరులోనో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతం లో స్పీకర్ కోడెల అతిథి గృహానికి చేరుకునేటప్పటికే రైతులు సమావేశాన్ని బహిష్కరించి గేటు బయటకు వెళ్ళారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ రైతులను బతిమిలాడి వెనక్కు తీసుకుని వచ్చారు.
 
 సమావేశం జరుగుతున్నంతసేపు మీడియాను బయటకు పంపి కిటికీల కర్టన్లను సైతం మూసివేశారు. వాస్తు బాగుందని సీఎం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి చెప్పగా... మా వాస్తు పగిలిపోతుంటే మీరె లా భూ సమీకరణ చేస్తారని రైతులు నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేందుకు సిద్ధంగాలేమని 13 గ్రామాల రైతులు స్పష్టంచేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడుతూ... 13 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఒకటికి నాలుగుసార్లు రైతులతో సమావేశం ఏర్పా టు చేసి వారిని సంతృప్తిపరిచేలా ముందుకు వెళతామని తెలిపారు. సమావేశంలో రైతు నాయకుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరితో పాటు 13 గ్రామాల రైతులు పాల్గొన్నారు.
 
 రైతుల సమావేశం రసాభాస
 రాజధాని ప్రాంత రైతులతో మంత్రుల సబ్ కమిటీ గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తొలుత విజయవాడలో సమావేశమని రైతులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరుకు మార్చినట్టు రైతులకు తెలపడంతో రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాల రైతులు ఐదు గంటల ప్రాంతానికే గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. కానీ ఎనిమిది గంటలవరకు ఎమ్మెల్యే కానీ మంత్రుల సబ్ కమిటీ సభ్యులు కానీ రాలేదు.
 
 ఆగ్రహించిన రైతులు ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చిన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను నిలదీశారు. సమావేశానికి 15మంది రైతులు సరిపోతారని ఆయన వ్యాఖ్యానించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధలు చెప్పుకోవడానికి  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి స్థానం కల్పించాలని ఉండవల్లి, పెనుమాక రైతులు పట్టుబట్టారు. అసలు తాము భూములు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీపై  రైతు చంద్రశేఖర్ మాట్లాడుతుండగా మంత్రి రావెల అనుచరులు, వాదనకు దిగారు. దీంతో తమను అవమానిస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించి  బయటకు వచ్చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement