సాక్షి, విజయనగరం: వరద బాధితులకు పూర్తిగా న్యాయం జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాడతామని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టం చేశారు. కష్టనష్టాల్లో ప్రజలకెప్పుడు అండగా ఉంటామని, ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడతామని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు. జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు వైఎస్ మాదిరిగా మేలు చేస్తారని, వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధితులకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తారని హామీ ఇచ్చారు. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో విజయమ్మ బుధవారం పర్యటించారు. అటు రైతులకు, ఇటు ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కోల్పోయిన రైతుల పరిస్థితి, ఇళ్లు కూలిపోయిన బాధితుల అవస్థలు చూసి చలించిపోయారు. రైతులకు దెబ్బ మీద దెబ్బతగిలిందని, తీరని నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. వర్షాలకు పడ్డ బాధలు, నష్టపోయిన తీరును విజయమ్మ వద్ద బాధితులు వెళ్లగక్కారు. మీరైనా ఆదుకోవాలని వాపోయారు. ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ నిలబడుతుందని, జగన్‌మోహన్‌రెడ్డితో మంచిరోజులొస్తాయని భరోసా ఇస్తూ బాధితుల్ని విజయమ్మ ఓదార్చారు.
విజయమ్మ వద్ద రైతుల గోడు
వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా విజయమ్మ తొలుత భోగాపురం మండలం రావాడ గ్రామాన్ని సందర్శించారు. రావాడ-తూడెం మధ్య రోడ్డుపై కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అవనాపు రైతు జరిగిన నష్టాన్ని, కల్వర్టు ప్రాధాన్యాన్ని వివరించారు. కృష్ణసాగరం చెరువు నుంచి నీరు పోయేందుకు ఈ కల్వర్టును నిర్మించారని, దీని ద్వారా 1500 ఎకరాలు సాగవుతుందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో అటు పంట మునిగిపోయిందని, ఇటు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ఆ పక్కనే ఉన్న వైఎస్సార్ సీపీ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు కల్వర్టు కొట్టుకుపోవడం వల్ల ఎదురయిన ఇబ్బందులు, ఈ ప్రాంత రైతుల సమస్యల్ని విజయమ్మ దష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా తమ వంతుకృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
కూలిన ఇళ్లు చూసి చలించిపోయిన విజయమ్మ
మండల కేంద్రమైన భోగాపురం బీసీ, ఎస్సీ కాలనీల్లో వర్షాలకు కూలిపోయిన ఇళ్లును విజయమ్మ పరిశీలించారు. అనంతరం బాధితులతో మమేకమయ్యారు. సరోజిని, కనకమ్మ తదితర మహిళలు తమకు జరిగిన నష్టాన్ని ఆవేదనతో వివరించారు.ప్రభుత్వం పట్టించుకోలేదని, అధికారులు ఇంతవరకు స్పందించలేదని, జగన్‌మోహన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇదే సందర్భంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి సుజయ్‌కృష్ణరంగారావు మాట్లాడుతూ సమస్యలు తెలుసుకోవడానికే విజయమ్మ ఇక్కడికొచ్చారని, స్పష్టమైన హామీ ఇస్తారన్నారు. పెనుమత్స సాంబశివరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు మాట్లాడూతూ 30ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లు ఈ వర్షాలకు కూలిపోయాయని, అన్నీ కోల్పోయి నాశనమైపోయారని విచారం వ్యక్తం చేశారు. దీంతో విజయమ్మ చలించిపోయారు. బాధితుల్ని ఓదా ర్చి భరోసా ఇచ్చారు. ఇళ్ల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తానని భరో సా ఇచ్చారు. జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తారని హామీ ఇచ్చారు.
కొవ్వాడలో మొక్కజొన్న రైతుల పరామర్శ
పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను విజయమ్మ పరిశీలించారు. పల్లి రామకృష్ణ అనే రైతు పొలంలో దిగి కుళ్లిపోయిన మొక్కజొన్నను పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతు రామకృష్ణ తమకు జరిగిన నష్టాన్ని కన్నీటి పర్యంతమవుతూ వివరించాడు. ఈ ప్రాంతంలో 400 ఎకరాలు ఇలాగే అయ్యిందని, కనీసం మొక్కజొన్న కండెలు విరపడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, పశువులకు కూడా పనికి రాకుండా తయారైందని మొర పెట్టుకున్నాడు. జగన్‌మోహన్‌రెడ్డి విడుదలయ్యారని సంతోషించామని, ఆయనే మమ్మల్ని ఆదుకోవాలని కోరాడు. ఇదే సందర్భంలో జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు పక్కనే ఉన్న పతివాడ తది తర గ్రామాల్లో జరిగిన నష్టాన్ని ఫొటోల ద్వారా విజయమ్మకు చూపించారు. దీంతో ఆమె స్పందిస్తూ న్యాయం జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో బాధిత రైతులనుద్దేశించి మాట్లాడారు. నష్టపోయిన పంటలు చూస్తుంటే బాధగా ఉందని, అన్నిరకాలుగా ఆదుకునేలా ప్రభుత్వంపై వత్తిడి చేస్తామని, కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని, హుడా కమిషన్ సిఫార్సుల ప్రకారం పరిహారం ఇచ్చేలా డిమాండ్ చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పూసపాటిరేగ జాతీయరహదారిపై పడేసి ఉన్న మొలకెత్తిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. జరి గిన నష్టాన్ని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని. జగన్ మేలు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ విధంగా విజయమ్మ జిల్లా పర్యటన ఆద్యంతం రైతులు, ఇతరత్రా బాధితుల గోడు వింటూ, ఓదార్చుతూ, సమస్యలు తెలుసుకుంటూ, భరోసా ఇస్తూ, ప్రభుత్వం తీరును దుయ్యబడుతూ ముందుకు సాగారు. విజయమ్మ వెంట పర్యటనలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి సుజయ్‌కృష్ణరంగారావు, విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు కాకర్లపూడి శ్రీనివాసరాజు, పెనుమత్స సురేష్, సింగుబాబు, సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, గేదెల తిరుపతి, బోకం శ్రీనివాస్, అవనాపు విజయ్, రాయల సుందరరావు, కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్,శత్రుచర్ల చంద్రశేఖరరాజు, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ, పార్టీ నేతలు ఆదాడ మోహనరావు, డాక్టర్ పెద్దినాయుడు, బొత్స కాశినాయుడు, గులిపల్లి సుదర్శనరావు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, తుమ్మగంటి సూరినాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, తిలప్పనాగిరెడ్డి, భూతిరాజుశ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.