సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్‌ఆర్ ఉండగా మేము ఎప్పుడూ ఇంత బాధ పడలేదు. ఆ చిరునవ్వు మా బాధలన్నీ తొలగిస్తుందనే భరోసా ఉండేది. అడిగినవన్నీ ఇచ్చారు. మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన హయాంలో సుభిక్ష పాలన సాగింది. అమ్మా... ఇప్పుడు మాత్రం చాలా కష్టాల్లో ఉన్నాం. బాధలు పడుతున్నాం. మీరు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు లేరని పలువురు వరద బాధితులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఎదుట వాపోయారు. బుధవారం వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన విజయమ్మ పలు ప్రాంతలకు చెందిన రైతులు, వరద బాధితుల ఆవేదన చూసిన చలించి పోయారు. ‘‘ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. ఆదుకోవాలనే మంచి మనసు లేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలన్నీ తీరుతాయని’’ చెప్పారు.
లావేరు మండలం బుడమూరు, సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర వద్ద రైతులు, వరద బాధితులు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో రూ 400 కోట్ల మేర వరద నష్టం సంభవించింది. రైతులకు ఇంతవరకు పైసా సాయం చేయలేదు. అసలు ఈ ప్రభుత్వం ఎవరికి ఏమిచేసిందని అడుగుతున్నాన న్నారు. జిల్లా ప్రజలు వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రూ 300 కోట్లు కేటాయించి నాగాళి, వంశధార నదుల కరకట్టలు నిర్మించాల్సిందిగా ఆదేశిస్తే ఇంతవరకు జరగలేదని చెప్పారు. జలయజ్ఞం పనులు జరిగి ఉంటే ఇప్పుడు జిల్లాకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం నేరుగా రైతులకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా ఆమె బుడుమూరు వద్ద తెగిపోయిన నారాయణసాగర్ చెరువును పరిశీలించారు. ఊరిలోకి నీరు చేరిన రోజు తాము నిద్రలేకుండా గడిపామని మహిళా నాయకురాలు కింతలి రమావతి, కింతలి ప్రసాదరావు, బుడుమూరు మాజీ ఎంపీటీసీ రేగాన రాంబాబు తెలిపారు.
అనంతరం శ్రీకాకుళం పట్టణంలోని హయత్‌నగరంలో గోడకూలి మృతి చెందిన ఎర్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి బలగ హడ్కో కాలనీలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇంట్లో నుంచి నీరు తోడుకుంటున్న పి.సుశీల, ఎం.లక్ష్మి వద్దకు వెళ్లి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. నరసన్నపేట మండలం మడపాం వద్ద రైతులతో మాట్లాడారు. పోలాకి మండలంలోని సుసరాం గ్రామంలోని తంపర భూములను పరిశీలించారు. దుంపల భాస్కరరావు, కరిమి రాజేశ్వరావు, దుంపల విజయమ్మ తమ బాధలు చెప్పుకున్నారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, వడ్డివాడ పొలాలు పరిశీలించారు. హనుమంతునాయుడి పేట ముంపు ప్రాంతాలు పరిశీలించారు. అక్కడి నుంచి వడ్డితాండ్ర వెళ్లారు. థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి బుధవారం దీక్ష విరమింప జేశారు.
ఈ పర్యటనలో ఆమె వెంట పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, బగ్గు లక్ష్మణరావు, ఎం.వి.కృష్ణారావు, కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పి.ఎం.జె.బాబు, పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు విశ్వసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, కొయ్య ప్రసాదరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు బల్లాడ హేమమాలినీరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.టి.నాయుడు, పార్టీ నేతలు కూన మంగమ్మ, కోత మురళి, పొన్నాడ వెంకటరమణ, కిల్లి ల క్ష్మణరావు, బల్లాడ జనార్దనరెడ్డి, వరుదు బాబ్జి, మార్పు ధర్మారావు, ఎన్ని ధనుంజయ్, పైడి రాజారావు, చింతాడ గణపతి, చింతాడ మంజు, గేదెల రామారావు, ప్రధాన రాజేంద్ర, దుంపల శ్యాం, కె.వి.వి.సత్యనారాయణ, దవళ అప్పలనాయుడు, గేదెల పురుషొత్తం, తంగి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.