ప్రాథమికరంగ మిషన్‌కు ‘కృషి కేబినెట్’ | Farming should be a Sunrise Sector: Naidu | Sakshi
Sakshi News home page

ప్రాథమికరంగ మిషన్‌కు ‘కృషి కేబినెట్’

Published Sat, Jun 27 2015 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రాథమికరంగ మిషన్‌కు ‘కృషి కేబినెట్’ - Sakshi

ప్రాథమికరంగ మిషన్‌కు ‘కృషి కేబినెట్’

వ్యవసాయ యాంత్రీకరణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు
* రాష్ట్రంలో ఆక్వా, వాటర్ వర్సిటీలు.. వృద్ధిరేటు లక్ష్యం 18.2 శాతం
* కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రాథమికరంగ మిషన్‌కు దిశానిర్దేశం చేసేందుకు, నిధులు ఇతర సమస్యలు రాకుండా చూసేందుకు ‘కృషి కేబినెట్’ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పా రు. 18.2 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఈ కమిటీ వారానికోసారి సమావేశమవుతుందని తెలిపారు.

విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ మిషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. ప్రాథమికరంగ మిషన్‌కు జిల్లాల్లో అదనపు జేసీలను ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018-19 కల్లా పూర్తి చేస్తామని, కుడి కాలువ భూసేకరణకు రూ.700 కోట్లు రైతులకు పరిహారంగా ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడిన 65 శాతం జనాభా కోసమే ఈ మిషన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్రిశాట్, నాబార్డును కన్సల్టెన్సీగా నియమించామన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణను గ్రామా ల్లో రైతు మిత్ర, డ్వాక్రా సంఘాలకు అప్పగించి వారికి రుణాలు ఇప్పించి, రాయితీలు ఇస్తామని చెప్పారు. యాంత్రీకరణకు రూ.1600 నుంచి రూ.1700 ఖర్చవుతుందని, సంవత్సరానికి రూ.400 కోట్లు ఇస్తామన్నారు. లక్ష ట్యాబ్‌లు ఇవ్వాలనుకుని ఇప్పటికి 45 వేలు ఇచ్చామన్నారు. ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ఇవ్వనున్నామని, దీనికి రూ.4,900 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ-పాస్ ద్వారా కృష్ణా జిల్లాలోనే నెలకు రూ.10 కోట్లు ఆదా అవుతున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో దీన్ని అన్ని జిల్లాల్లో విస్తరిస్తామని తెలిపారు. రాయలసీమను అరటి హబ్‌గా తయారు చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్వా, వాటర్ యూనివర్సిటీలు ఏర్పాటుచేస్తామన్నారు.
 
మిషన్లు, గ్రిడ్ల గురించి జనానికి అర్థం కావడంలేదు..

ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ప్రజలకు అర్థం కావడంలేదని వాటి పేర్లు మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త పేర్లు సూచించాలని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌కు సూచించి ఇది ఆయనకు అగ్ని పరీక్ష అని చమత్కరించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నీరున్నా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ముంపును తట్టుకునే 1121 రకం వరి వంగడాన్ని ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచించారు.

ఎరువులు, పురుగుమందుల అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు ఆ షాపుల్లో ఈ-పాస్ అమలు చేయాలని సదస్సులో నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌పీ టక్కర్ మిషన్ లక్ష్యాల గురించి వివరించగా, ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌పీ వాణి లక్ష్యాలు వాటి అమలు తీరుతెన్నుల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement