నాన్న.. మళ్లీ ప్రాణం పోశాడు | father given to life | Sakshi
Sakshi News home page

నాన్న.. మళ్లీ ప్రాణం పోశాడు

Published Sun, Jun 14 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

నాన్న.. మళ్లీ ప్రాణం పోశాడు

నాన్న.. మళ్లీ ప్రాణం పోశాడు

మృత్యుంజయుడు.. కిరణ్
పునర్జన్మనిచ్చిన కన్నతండ్రి
కవచంలా కాపాడి.. తను మృత్యుఒడిలోకి..

 
కంబాల చెరువు (రాజమండ్రి): తాను ప్రాణాలు కోల్పోయినా సరే పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని తపించిపోయాడు ఆ తండ్రి. ప్రమాదం జరుగుతుందని తెలియగానే చివరి నిమిషం వరకు తన పిల్లలను రక్షించేందుకు యత్నించాడు. తన ఒడిలోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొని తాను రక్షణ కవచంలా నిలిచాడు ఈగల రాంబాబు. వ్యాను ప్రమాదానికి గురైందని పసిగట్టగానే కూతురు సంధ్యను, కొడుకు కిరణ్ సాయిని గుండెలకు హత్తుకున్నాడు. ఆ తండ్రి ముందుచూపే కిరణ్‌సాయి ప్రాణాలతో బయటపడడానికి కారణమైంది. రాంబాబు సహా 21 మంది అక్కడికక్కడే మరణించినా, గాయపడ్డ సంధ్య తర్వాత మృత్యువాత పడ్డా.. తండ్రి పొదివి పట్టుకోవడం వల్లే సారుు ప్రాణం దక్కింది. ఈ విషయాన్ని సాయి ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. విషాద వదనంతో వివరించే ప్రయత్నం చేశాడు. ‘‘నాన్న గట్టిగా పట్టుకున్నాడు.. వ్యానులో డోరువద్ద కూర్చు న్నా. నా పక్కన మా నాన్న, అక్క సంధ్య ఉన్నారు.   బ్రిడ్జిపై మలువు వద్దకు వచ్చేసరికి మా కారుకు పెద్ద శబ్దంతో కూడిన కుదుపు తగిలి గాలిలోకి వెళుతున్నట్టు అనిపించింది. ఇంతలో నాన్న రాంబాబు నన్ను, మా అక్క సంధ్యను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఇంతలో నేను నిద్రలోకి వెళ్లిపోయాను. మా అక్క నన్ను తట్టిలేపింది.

యాక్సిడెంటైంది అని చెప్పి ఏడుస్తూ మళ్లీ తను కారులోనే నిద్రలోకి వెళ్లిపోయింది. మా నాన్న, అమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మా అత్తయ్య వీళ్లంతా నిద్రపోతున్నట్టుగానే ఉండిపోయారు. వాళ్ల ఒంటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఏం చేయాలో తెలి యక నేను నడుచుకుంటూ పైకి వచ్చాను. అటుగా వెళుతున్న ఒకాయనకు జరిగింది చెప్పాను. అతను వ్యానును చూసి వెంటనే మరి కొంతమందిని పిలి చాడు. తర్వాత పోలీసులు వచ్చారు’’ అని కిరణ్ సాయి విషయాన్ని వివరించాడు.

 ఒకే ఒక్కడు..: ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూఫా న్ వాహనం గోదావరిలోకి బోల్తాపడిన దుర్ఘటనలో బతికి బయటపడ్డది పదేళ్ల ఈగల కిరణ్‌సాయి ఒక్కడే. 30 అడుగుల ఎత్తు నుంచి వాహనం బోల్తాకొట్టినా కిరణ్‌సాయి ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడిగా నిలిచాడు. తనకు ఏం జరిగిందో.. ఎక్కడ ఉన్నాడో  తెలియక రాత్రంతా రోదిస్తూ గడిపిన కిరణ్‌సాయి షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. ప్రమాదం అర్ధరాత్రి దాటాక జరగగా తెల్లవారుజామున  స్థానిక మత్స్యకారులు సారుు రోదనను ఆలకించడంతోనే ఈ దుర్ఘటన వెలుగుచూసింది. సాయి నాలుగో తరగతి చదువుతున్నాడు. తన వారంతా చనిపోయారని తెలియని ఆ బాలుడు ‘అమ్మా..అమ్మా..’ అంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారందరి హృదయం చలించిపోయింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆ బాలుడిని అనునరుుంచి, ధైర్యం చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement