జగన్‌కు ప్రజాప్రతినిధుల వినతి
నక్కపల్లి: ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువగా ఉంటోందని, దీన్ని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. గోకులపాడు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి నక్కపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జాతీయరహదారిపై వందలాది మంది కార్యకర్తలు,నాయకులు, మహిళలు ఉండడంతో ఆయన వాహనం దిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల పెత్తనం గురించి వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావులు వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో పచ్చపాతం చూపిస్తున్నారని వాపోయారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు విలువలేకుండా పోతోందని వివరించారు.
పార్టీతరపున కోర్టును ఆశ్రయించి టీడీపీవారి ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. రుణాలు మాపీ వర్తించలేదని పలువురు డ్వాకామహిళలు జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. పొదుపు సొమ్మును వడ్డీలకు జమచేసుకుంటున్నారని, చంద్రబాబు మోసం చేశాడన్నారు. ఇందుకు జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ దీనిపై పార్టీ తరపున రాజీలేనిపోరాటం చేస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీల విషయం పార్టీలో చర్చించి తగునిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో పార్టీనాయకులు మణిరాజు, పొడగట్లపాపారావు, జోగారావు, లొడగలచంద్రరావు, శేషారత్నం, ఎరిపల్లిశ్రీను, వెలగా ఈశ్వరరావు, గొర్లి నర్సింహమూర్తి, తిరుపతిరావు, మూలపర గోవిందు, గోసల కాసులమ్మ, కోమర్తి బాబూరావు, ముసలయ్య, వీసంరాజు ఉన్నారు.
జన్మభూమి క మిటీల పెత్తనాన్ని అడ్డుకోండి
Published Thu, Apr 2 2015 2:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement