ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎరువుల సమస్య తలెత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత అనుభవాల నుంచైనా సర్కారు గుణపాఠం నేర్చుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, నిజామాబాద్ :
ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎరువుల సమస్య తలెత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత అనుభవాల నుంచైనా సర్కారు గుణపాఠం నేర్చుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరగాయలు సాగు చేస్తున్నవారు, సన్న రకాల వరిని పండిస్తున్న అన్నదాతలు యూరియా కోసం పీఏసీఎస్‌లు, ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్దకు చక్కర్లు కొడుతున్నారు. పత్తి పంటకు కూడా యూరియా అవసరం ఏర్పడింది. కానీ జిల్లాలో మాత్రం ఈ ఎరువు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చివరి దశలో ఉన్న ఖరీఫ్ పంటలు గట్టెక్కాలంటే ఉన్నపలంగా కనీసం 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ అంచనాకొచ్చింది. జిల్లాలో ఉన్న డీలర్ల వద్ద నాలుగు వందల మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియానే నిల్వ ఉంది. ఎరువుల నిల్వలపై జిల్లా వ్యవసాయశాఖ ఎప్పటి కప్పుడు ఆ శాఖ కమిషనరేట్‌కు నివేదికలు పంపుతుంది. రైతుల అవసరాలు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో యూరియా నిల్వలు నిండుకున్నాయని, వెంటనే ఈ ఎరువును జిల్లాకు పంపాలని కమిషనరేట్‌కు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కానీ స్పందన శూన్యం.
బఫర్ నిల్వ నామమాత్రమే..
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 3.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1.40 లక్షల హెక్టార్లలో వరి సాగైందని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. ఈ శాఖ ప్రణాళిక ప్రకారం ఖరీఫ్‌లో 1.23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ సర్కారు మాత్రం జిల్లాకు 1.18 లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించింది. కేటాయింపుల ప్రకారం కూడా యూరియా సరఫరా చేయలేదు. ఇప్పటి వరకు 99 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఎరువుల సమస్య తీవ్ర రూపం దాల్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో అందించడం కోసం ప్రభుత్వం బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుతుంది. ప్రభుత్వం వెంటనే యూరియాను జిల్లాకు సరఫరా చేయని పక్షంలో ఈ బఫర్ స్టాక్‌ను వినియోగించుకోవచ్చు. సుమారు 6,670 మెట్రిక్ టన్నుల యూరియా ఈ బఫర్ స్టాక్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని గోదాముల్లో ఉంది.
కొరత ఉన్న మండలాలివే..
పంట బాగా ఎదగడానికి రైతులు యూరియా ను ఎక్కువగా వినియోగిస్తారు. జిల్లాలో ఆలస్యంగా నాట్లు వేసుకున్న నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్ తదితర మండలాలలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోచారం ప్రాజెక్టులోకి ఆలస్యం గా నీరు చేరడంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో యూరి యా అవసరం ఉంది. మాచారెడ్డి, భిక్కనూరు మండలాల్లో కూడా యూరియా కొరత ఉంది. కూరగాయ పంటలు సాగు చేస్తున్న ఆర్మూర్, బాల్కొండ, నందిపేట్, నిజామాబాద్ మండలాల్లో కూడా యూరియా అవసరం ఉంది.
పొటాష్ ఎరువులదీ ఇదే పరిస్థితి..
ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పొటాష్ వంటి ఎంఓపీ ఎరువులదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ ఎరువులున్నాయి. అయితే, ఈ ఎరువులకు రైతుల నుంచి డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు.